CM Revanth Reddy : స్థానిక పోరుకు తెలంగాణా ప్రభుత్వం సిద్ధం ?
స్థానిక పోరుకు తెలంగాణా ప్రభుత్వం సిద్ధం ?
CM Revanth Reddy : స్థానిక సంస్థల ఎన్నికలపై రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళ్లడమే ఉత్తమమని సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) మంత్రులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై అందుబాటులో ఉన్న మంత్రులతో శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం అంతర్గతంగా చర్చించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికలకు వెళ్లడమే మంచిదని అత్యధిక మంది మంత్రులు అభిప్రాయపడ్డారని పార్టీవర్గాలు తెలిపాయి. అయితే, తుది నిర్ణయాన్ని సీఎంకే వదిలేసినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేలా వెంటనే జీవో జారీ చేసే దిశగా కసరత్తు చేయాలని నిర్ణయించారు.
CM Revanth Reddy Comments
ఈ ప్రక్రియపై స్పష్టత తీసుకుని… 3, 4 రోజుల్లో మరోసారి సీఎం, మంత్రులు సమావేశమై ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. సెప్టెంబరు నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గతంలో ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. బీసీ రిజర్వేషన్ల బిల్లులను గవర్నర్‌కు పంపినా ఇంతవరకు ఆమోదం పొందలేదు. గతంలో పంపిన బిల్లులపై కేంద్రం నుంచి కూడా స్పందన లేదు. బిల్లుల ఆమోదానికి భాజపా రాజకీయ కారణాలతో సహకరించదని, ఎన్నికలను వాయిదా వేయడం వల్ల ఉపయోగం ఉండదని కొందరు మంత్రులు చెప్పినట్లు సమాచారం. బిల్లుల ఆమోదంతో సంబంధం లేకుండా రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వమే జీఓ జారీ చేసి… ఎన్నికలకు వెళ్లేందుకు ఉన్న అవకాశాలను సైతం పరిశీలించినట్లు తెలుస్తోంది. ఒకవేళ న్యాయపరమైన అవరోధాలు ఎదురైతే పార్టీపరంగా బీసీలకు 42% టికెట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందనే కోణంలోనూ చర్చించినట్లు సమాచారం.
చట్టప్రకారం అధికారికంగా రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చిన తరువాతే ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని సీఎంకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పినట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ శాసనసభలో ఆమోదించిన రాష్ట్రపతి, గవర్నర్లు బిల్లులను 90 రోజుల్లోగా ఆమోదించాలనే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకూ వేచి చూస్తే ఎలా ఉంటుందని సీఎం అడిగారని నేతలు తెలిపారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఈ నెలాఖరులోగా ఎన్నికలకు వెళ్లడమే మంచిదని మంత్రులు సూచించినట్లు సమాచారం. చివరకు సీఎంకే నిర్ణయం వదిలేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ ఇవ్వలేనిపక్షంలో మరింత గడువు కావాలని హైకోర్టును ప్రభుత్వం కోరాల్సి ఉంటుందనే దానిపైనా చర్చించినట్లు సమాచారం.
Also Read : CM Pinarayi Vijayan: రూ.1000 కోట్లతో శబరిమల అభివృద్ధి – సీఎం విజయన్
