CM Revanth Reddy: దిల్లీలో సమావేశమైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి

దిల్లీలో సమావేశమైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల అంశాలపై చర్చించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. దిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో చంద్రబాబు (CM Chandrababu), రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీ ప్రారంభంలో సీఆర్‌ పాటిల్‌తో పాటు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పరస్పరం కరచాలనం చేసుకున్నారు.

CM Revanth Reddy Meet

గోదావరి-బనకచర్ల (Banakacharla) ప్రాజెక్టు అనుసంధానం సింగిల్‌ పాయింట్‌ అజెండాను ఏపీ… 13 అంశాలను తెలంగాణ ప్రతిపాదించాయి. ఇరు రాష్ట్రాల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం అజెండాలో చేర్చింది. ఈ భేటీకి ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, జలవనరుల శాఖ కార్యదర్శులు, ఇంజినీర్లు హాజరయ్యారు.

సమావేశానికి ముందు ఆయా రాష్ట్రాల అధికారులతో ఇరువురు సీఎంలు సమావేశమయ్యారు. భేటీలో లేవనెత్తాల్సిన అంశాలు, సాంకేతికంగా ఇవ్వాల్సిన సమాధానాలపై చర్చించారు. సీఎంలు తమ అధికారిక నివాసాల్లో సుమారు గంటన్నరపాటు సీఎస్‌లు, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు.

బనకచర్లతో ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం ఉండదు – ఏపీ

గోదావరి-బనకచర్ల (Banakacharla) ప్రాజెక్టు అనుసంధానం సింగిల్‌ పాయింట్‌ అజెండాను ప్రతిపాదించిన ఏపీ… ఈ ప్రాజెక్టు లక్ష్యాలను నివేదిక రూపంలో సమర్పించింది. సముద్రంలో వృథాగా కలిసే జలాలనే వినియోగిస్తామని వివరించింది. ఈ సందర్భంగా గోదావరిలో వందేళ్ల సరాసరి ప్రవాహాల గణాంకాలను పేర్కొంది. ఏటా 3వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని తెలిపింది. బనకచర్ల ద్వారా గరిష్ఠంగా 200 టీఎంసీలే తరలిస్తామని వివరించింది. ఈ ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం ఉండదని… 11 ఏళ్లుగా తెలంగాణలో కట్టిన ఏ ప్రాజెక్టుకూ అభ్యంతరం చెప్పలేదని పేర్కొంది. దిగువ రాష్ట్రంగా తమ చర్యలను తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరింది.

తెలంగాణ ప్రతిపాదించిన 13 అంశాలివే

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వాలి.
శ్రీశైలం నుంచి వేరే బేసిన్‌కి ఆంధ్రప్రదేశ్ నీటి తరలింపు పనులను వెంటనే ఆపేయాలి
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రారంభించిన ప్రాజెక్టులకు సహకరించేలా కృష్ణా ట్రైబ్యునల్‌లో మద్దతుగా వాదించేలా ఏపీని ఒప్పించాలి
కృష్ణానదీ జలాలను వేరే బేసిన్‌కు తరలించకుండా కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్‌ బోర్డు చర్యలు తీసుకునేలా ఆదేశించాలి. కృష్ణా జలాలను అక్రమ తరలింపును అడ్డుకునేందుకు టెలిమెట్రీలను ఏర్పాటు చేసేందుకు ఏపీ అంగీకరించాలి.
తుంగభద్ర బోర్డు నీటి తరలింపుపై చర్చించాలి.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై ఎన్జీటీ ఉత్తర్వులను అమలు చేసే విధంగా కేంద్ర జలశక్తి శాఖ చర్యలు తీసుకోవాలి. ఈ పథకంపై చట్టపరంగానే ముందుకు వెళ్లాలి.

శ్రీశైలం కుడి కాలువ ద్వారా ఎక్కువ నీటి తరలింపును నియంత్రించాలి.
శ్రీశైలం ప్రాజెక్టులో కొత్త ప్రాజెక్టులు హంద్రీనీవా, వెలిగొండ, గురు రాఘవేంద్ర నిర్మాణాలను నియంత్రించాలి.
శ్రీశైలం డ్యాం సేఫ్టీకి తగిన చర్యలు తీసుకోవాలి.
శ్రీశైలం నుంచి నీటి తరలింపు ద్వారా విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలుగుతోంది.. దీనిని అడ్డుకోవాలి.
పోలవరం ప్రాజెక్టు తరహాలోనే ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. ఇచ్చంపల్లి నుంచి కావేరికి గోదావరి జలాల తరలింపుకు మేము సిద్ధం. అందులో 200 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అనుమతులు ఇవ్వాలి.
సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలి.
ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు ఏఐబీపీ కింద నిధులు ఇవ్వాలి. మహారాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వమే చర్చలు జరిపి తుమ్మిడి హట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి సహకరించాలి.

Also Read : Visakhapatnam: మానవ అక్రమ రవాణాకు చెక్ పెట్టిన విశాఖ పోలీసులు

Leave A Reply

Your Email Id will not be published!