CM Revanth Reddy: కీరవాణితో సీఎం రేవంత్ భేటీ ! రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ పై చర్చ !
కీరవాణితో సీఎం రేవంత్ భేటీ ! రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ పై చర్చ !
CM Revanth Reddy: తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణితో భేటీ అయ్యారు. హైదరాబాద్ మణికొండలోని కీరవాణి మ్యూజికల్ స్టూడియోకు ముఖ్యమంత్రి వచ్చారు. తెలంగాణా రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ కు సంబంధించిన ట్యూన్లపై చర్చించారు. రాష్ట్ర గీతంలో ప్రాధాన్యం తగ్గకుండా, నిడివి తగ్గే విధంగా తీసుకున్న చర్యలను గీత రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి… సీఎం రేవంత్ కు వివరించారు. ఈ సందర్భంగా తాను స్వరపర్చిన కొన్ని ట్యూన్లను కీరవాణి వినిపించగా.. రేవంత్‌రెడ్డి కొన్ని సవరణలు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో పాటు ‘జయ జయహే తెలంగాణ’ గీత రచయిత అందెశ్రీ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీపీఆర్‌ఓ అయోధ్యరెడ్డి, కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ తదితరులు ఉన్నారు.
CM Revanth Reddy Meet..
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రూతలూగించిన అందెశ్రీ గీతం ‘జయ జయహే తెలంగాణ’కు ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరకల్పన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ గీతాన్ని ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర గీతంగా ప్రకటించడంతో… జూన్ 2న పెరెడ్ గ్రౌండ్ వేదికగా నిర్వహించబోయే రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఈ గీతాన్ని ఆవిష్కరించనున్నారు. సుమారు 6 నిమిషాల నిడివి కలిగి, ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందిన గీతాన్ని అలాగే ఉంచి స్వరకల్పన చేస్తున్నారు. దీనితోపాటు అధికారిక కార్యక్రమాల్లో ఆలాపనకు వీలుగా 60 నుంచి 90 సెకన్లకు ఈ గీతాన్ని కుదించనున్నారు.
ప్రధాన గీతంలోని ప్రాధాన్యం తగ్గకుండా నిడివిని తగ్గించే బాధ్యతను అందెశ్రీకే అప్పగించారు. ఈ రెండింటికీ స్వరకల్పన చేసే బాధ్యతను కీరవాణి చేపట్టారు. దీని పురోగతిపై చర్చించడానికి హైదరాబాద్ మణికొండలోని కీరవాణి మ్యూజికల్ స్టూడియోకు ముఖ్యమంత్రి వచ్చారు. ఈ సందర్భంగా తాను స్వరపర్చిన కొన్ని ట్యూన్లను కీరవాణి వినిపించగా… రేవంత్‌రెడ్డి కొన్ని సవరణలు సూచించారు. ఆవిర్భావ దినోత్సవం నాటికి రెండు రకాల గీతాల ట్యూన్లను సిద్ధం చేయాలని కోరారు.
Also Read : Juvvadi Narasinga Rao : తన ఓటమికి కేసీఆర్ కారణమంటున్న కోరుట్ల కాంగ్రెస్ ఇంచార్జి