CM Revanth Reddy: బీసీ రిజర్వేషన్లపై బీజేపీది ద్వంద్వ వైఖరి – సీఎం రేవంత్‌రెడ్డి

బీసీ రిజర్వేషన్లపై బీజేపీది ద్వంద్వ వైఖరి - సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy : కులగణన సర్వే ఆధారంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు రూపొందించామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. దిల్లీ పర్యటనలో భాగంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ… అసెంబ్లీ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించినట్లు చెప్పారు. బిల్లు ఆమోదానికి కేంద్రంలోని విపక్ష కూటమి నేతలను కూడా కలిసి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్లు చెప్పారు. తెలంగాణలో సెప్టెంబర్‌లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిందని సీఎం గుర్తుచేశారు. కేంద్రం త్వరగా రిజర్వేషన్ల బిల్లును ఆమోదిస్తే.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.

CM Revanth Reddy Slams BJP

‘‘బీజేపీ నాయకత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. ఆ పార్టీ నేతలు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో మద్దతు ఇచ్చి.. ఇప్పుడు మరో మాట మాట్లాడుతున్నారు. ముస్లింల శాతాన్ని తీసివేయాలని కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ అంటున్నారు. భాజపా పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయం ఉంటుందా? యూపీ, గుజరాత్‌, మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లను ఎందుకు తొలగించడం లేదు? ఆయా రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు తొలగించాకే బీజేపీ నేతలు తెలంగాణ గురించి మాట్లాడాలి.

కులగణన సర్వేలో వ్యక్తుల వ్యక్తిగత వివరాలను వెల్లడించలేదు. 3.99 శాతం మంది తమకు ఏ కులం లేదని చెప్పారు. స్వతంత్ర నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారమే మేం ముందుకెళ్తున్నాం. బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నవారే సందేహాలు లేవనెత్తుతున్నారు. కులగణన సర్వే డేటా కావాలంటే ఆయా పార్టీల ముందు, అసెంబ్లీలో ప్రవేశపెడతాం. మేం కల్పించే రిజర్వేషన్లలో మతం ప్రస్తావనే లేదు. ముస్లింల పేరుతో మరోసారి భావోద్వేగ రాజకీయాలు చేయాలని బీజేపీ చూస్తోంది. మూడు రైతు వ్యతిరేక చట్టాల విషయంలో ఏం జరిగిందో అందరూ చూశారు. రైతు చట్టాల రద్దు స్ఫూర్తిగా బీసీ రిజర్వేషన్ల చట్టం ఆమోదం కోసం పోరాడుతాం.

దత్తాత్రేయను ఉపరాష్ట్రపతిని చేయాలి – సీఎం రేవంత్‌

10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లతో 50శాతం నిబంధన దాటిపోయింది. దాని విషయంలో అడ్డురాని నిబంధన బీసీల విషయంలో ఎందుకు వస్తోంది? ఓబీసీలకు న్యాయం చేయాలని భాజపాని కోరుతున్నా. కేంద్ర పదవుల్లో తెలంగాణకు, బీసీలకు అన్యాయం జరుగుతోంది. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీ నేతను తొలగించారు. ఇప్పటికే దత్తాత్రేయను గవర్నర్‌ పదవి నుంచి తొలగించారు. బీసీ అయిన దత్తాత్రేయను ఉపరాష్ట్రపతిని చేయాలి’’అని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Also Read : CJI Justice BR Gavai: జస్టిస్‌ వర్మ కేసు విచారణ నుంచి వైదొలిగిన సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌

Leave A Reply

Your Email Id will not be published!