CM Revanth Reddy: కులగణనలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ – సీఎం రేవంత్‌

కులగణనలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ - సీఎం రేవంత్‌

 

 

దేశంలో కుల గణన చేపట్టిన మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణా… ఈ విషయంలో దేశానికే ఆదర్శమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణాను మోడల్ గా తీసుకుని జన గణనతో పాటు కుల గణన కూడా పకడ్బందీగా చేపట్టాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. జూబ్లీహిల్స్‌ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా జన గణనతో పాటు కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కులగణన కోరుతూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. ఈ విషయంలో మొదటిగా ఆయనకు అభినందనలు చెప్పాలన్నారు.

 

‘‘కులగణనపై నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ విషయంలో దేశానికి మనం మార్గదర్శకంగా నిలిచాం. దేశంలో అనేక పార్టీలు కులగణన కోరుతున్నాయి. దీనిపై ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేపట్టాం. కులగణన విషయంలో కేంద్రమంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలి. అందులో కేంద్రమంత్రులు, సీనియర్‌ అధికారులను నియమించాలి. తెలంగాణలో బీసీలుగా ఉన్న బోయలు… కర్ణాటకలో మరో వర్గంలో ఉన్నారు. రాష్ట్రంలో 8వేల పేజీల్లో 57 ప్రశ్నల ద్వారా మేం వివరాలు సేకరించాం.

కులగణన విషయంలో తెలంగాణ అనుభవం కేంద్రానికి ఉపయోగపడుతుంది. ఎన్యుమరేటర్‌ నుంచి సీఎస్‌ వరకు పలుమార్లు సమీక్ష నిర్వహించాం. అనేక సలహాలు, సూచనలు వచ్చాయి. టోల్‌ఫ్రీ నంబర్‌ ఇవ్వడంతో పాటు ఆన్‌లైన్‌లో నమోదుకు అవకాశం కల్పించాం. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా కులగణన చేపట్టాం. తెలంగాణ మోడల్‌ తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని రాష్ట్రాలకు నిపుణుల కమిటీని పంపాలి. ప్రతి రాష్ట్రంతో మాట్లాడి ఆయా ప్రభుత్వాల సూచనలు తీసుకోవాలి. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాలి. స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలి. కులగణన పూర్తయ్యాక ఏం చేస్తారో స్పష్టంగా చెప్పాలి’’ అని కేంద్ర ప్రభుత్వానికి రేవంత్‌ సూచించారు.

కేసీఆర్‌ మాటలు నమ్మి మోసపోవద్దు – రేవంత్‌రెడ్డి

 

మాజీ సీఎం కేసీఆర్‌ రూ.8.15 లక్షల కోట్ల అప్పు చేసి పదవి దిగి వెళ్లిపోయారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోయాయో ఆనవాళ్లు తెలియడం లేదన్నారు. కేసీఆర్‌ చేసిన అప్పుల వడ్డీలు చెల్లించేందుకే రూ.1.58 లక్షల కోట్లు అప్పు చేయాల్సి వచ్చిందన్నారు. రవీంద్రభారతిలో నిర్వహించిన మే డే వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ కేసీఆర్‌ రూ. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మిస్తే… అది మూడేళ్లకే కూలిపోయింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1000 గ్యాస్‌ సిలిండర్‌ ను రూ.500కే ఇస్తున్నాం. తొలి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం.

నూతన రాష్ట్రంగా ఏర్పాటైన నాటికి మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రూ.8.15 లక్షల కోట్ల అప్పుల్లోకి ఎందుకు పోయింది? రాష్ట్రం అప్పులపాలయితే.. కేసీఆర్‌ కుటుంబానికి పత్రికలు, ఛానెళ్లు, ఫామ్‌హౌస్‌లు ఎలా వచ్చాయి? కనీసం ధర్నా చౌక్‌ లో నిరసన తెలిపే హక్కు లేకుండా దాన్ని మూసివేశారు. ప్రస్తుతం పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా మన కోర్సులు లేవు. వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచాలని నిర్ణయించాం. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకే స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం.

ప్రభుత్వానికి ప్రతినెలా రూ.18 వేల కోట్ల ఆదాయం వస్తోంది. గత ప్రభుత్వం చేసిన అప్పులపై కిస్తీలకు రూ.6 వేల కోట్లు పోతోంది. ప్రతి నెలా ఉద్యోగుల జీతభత్యాలకే రూ.6 వేల కోట్లు పోతోంది. ప్రతి నెలా రూ.22 కోట్లు వేల కోట్లు వస్తే తప్ప… ప్రభుత్వ కనీస అవసరాలు తీరవు. సర్పంచ్‌ లకు బకాయిలు గత ప్రభుత్వం పెట్టిపోయిందే. ఎక్కడ దొరికితే అక్కడ అడ్డగోలుగా అప్పులు తెచ్చారు. ఆర్థికంగా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే… కొత్త డిమాండ్లు చేస్తే ఎలా? ఏమైనా సమస్యలుంటే కూర్చొని పరిష్కరించుకుందాం. ఉట్టి తెగిపడాలని మాజీ సీఎం రోజూ శాపనార్థాలు పెడుతున్నారు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదని మాజీ సీఎం గుర్తుంచుకోవాలి. కపట నాటక సూత్రధారి మళ్లీ బయటకు వచ్చాడు.. నమ్మి మోసపోవద్దు’’ అని సీఎం చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!