CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవమే వరదకు పరిష్కారం – సీఎం రేవంత్
మూసీ పునరుజ్జీవమే వరదకు పరిష్కారం - సీఎం రేవంత్
CM Revanth Reddy : మూసీ పునరుజ్జీవమే వరద సమస్యకు శాశ్వత పరిష్కారమని, ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోని వరదనీరు మూసీని చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టంచేశారు. రాజధానిలో భారీ వర్షాలు (Rains) కురిసినా తట్టుకునేందుకు వీలుగా వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాలని ఆదేశించారు. వర్షాలతో నగరం అతలాకుతలం కాకుండా… జనజీవనం అస్తవ్యస్తం కాకుండా ఉండాలంటే అత్యవసరంగా శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరముందని అధికారులను అప్రమత్తం చేశారు.
దిల్లీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)… గురువారం రాత్రి హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం, తలెత్తిన ఇబ్బందులు, అధిగమించేందుకు అనుసరించాల్సిన తక్షణ చర్యలపై అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని విభాగాల అధికారుల అభిప్రాయాలను తీసుకున్నారు. వరద ప్రవాహానికి అడ్డంకులు ఉన్నందునే.. నగరంలో ఈ దుస్థితి తలెత్తుతోందని అధికారులు అభిప్రాయపడ్డారు.
CM Revanth Reddy – అన్ని వ్యవస్థలనూ ఆధునికీకరించాలి
‘‘హైదరాబాద్‌లో ఇప్పుడున్న రోడ్లు, డ్రైనేజీలు 5 సెంటీమీటర్ల వర్షం పడితే తట్టుకునే పరిస్థితి లేదు. ఒక్కోసారి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. హైదరాబాద్‌లో గురువారం రాత్రి కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే కొన్ని ప్రాంతాల్లో 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జూన్ నుంచి ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో సాధారణంతో పోలిస్తే 16 శాతం వర్షపాతం ఎక్కువగా నమోదైంది. వాతావరణ మార్పులే ఇందుకు ప్రధాన కారణం. భారీ వర్షాలతో తలెత్తే విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు.. విపత్తుల నివారణ, నిర్వహణ ప్రణాళికను సమర్థంగా అనుసరించాలి అని సూచించారు.
మూసీలోకి శుద్ధి చేసిన నీరు
డ్రైనేజీల ద్వారా వచ్చే నీటిని ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసి.. మూసీలో స్వచ్ఛమైన నీటి ప్రవాహం ఉండేలా శాశ్వత ప్రణాళికలు ఉండాలి. శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలు, ఇతర అవసరాలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా వినియోగించుకునే వీలుంటుంది. వందేళ్ల పాటు మహానగరంలో వరద సమస్య పునరావృతం కాకుండా ఉండాలంటే.. మూసీ పునరుజ్జీవమే ముఖ్యం. ఈ ప్రాజెక్టును వరద నీటి నిర్వహణకు వీలుగా డిజైన్ చేయాలి. ఆ దిశగా పనులు చేపట్టాలని ఆదేశించారు.
CM Revanth Reddy – మల్టీ లెవెల్ పార్కింగ్ జోన్
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి. ముఖ్యంగా పాతనగరంలో ఈ సమస్యను పరిష్కరించేందుకు పెడెస్ట్రియల్ జోన్‌ను ఏర్పాటు చేసి.. పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టాలి. చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి ప్రాంతాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ జోన్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి’’ అని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎం సెక్రటరీ మాణిక్‌రాజ్, పురపాలక శాఖ కార్యదర్శి ఇలంబర్తి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
55 కి.మీ. పొడవునా మూసీ పునరుద్ధరణ – సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌లో 55 కిలోమీటర్ల పొడవునా మూసీని పునరుద్ధరించటం ద్వారా పరీవాహక ప్రాంతంతో పాటు… నగరంలో ఉన్న అన్ని ప్రాంతాలు, కాలనీలు సురక్షితంగా ఉంటాయి. లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురికావు. నీటి ప్రవాహానికి ఎక్కడా అడ్డంకులు ఉండకూడదు. అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌లోని వరద సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా నగరంలోని అన్ని వైపుల నుంచి వర్షపు నీరు మూసీకి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయండి. హుస్సేన్‌సాగర్, దుర్గం, మీరాలం.. ఇలా అన్ని చెరువులు, కుంటలను నాలాల ద్వారా మూసీకి అనుసంధానం చేయాలి. చెరువుల పునరుద్ధరణ, నాలాల వెడల్పు ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తవ్వాలి.
Also Read : Tamilnadu Government: ఎన్‌ఈపీకి కౌంటర్ గా తమిళనాడులో నూతన విద్యావిధానం
