CM Revanth Reddy: ఎన్టీఆర్‌ స్ఫూర్తితో చంద్రబాబు, కేసీఆర్‌, జగన్ సహకరించాలి – సీఎం రేవంత్‌

ఎన్టీఆర్‌ స్ఫూర్తితో చంద్రబాబు, కేసీఆర్‌, జగన్ సహకరించాలి - సీఎం రేవంత్‌

CM Revanth Reddy : దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను ఎన్డీయే దుర్వినియోగం చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విమర్శించారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల వ్వవస్థలను ఎన్డీయే అపహాస్యం చేస్తోంది. రాజ్యాంగ రక్షణ కోసం పోరాడుతున్న కూటమి ఒక వైపు… రాజ్యాంగాన్నే రద్దు చేయాలని చూస్తున్న కూటమి మరో వైపు. పీవీ నరసింహారావు తర్వాత తెలుగువాడిని కీలక పదవిలో కూర్చోబెట్టే అవకాశం మనకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఏకతాటి మీదకు రావాలి. టీడీపీ, వైసీపీ, భారత రాష్ట్ర సమితి, ఎంఐఎం సహా అన్ని పార్టీలు… ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డికి (Sudarshan Reddy) మద్దతు తెలపాలి.

చంద్రబాబు, కేసీఆర్‌, జగన్‌, పవన్‌ కల్యాణ్‌ లకు విజ్ఞప్తి చేస్తున్నా… రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల నేతలంతా కలిసి రావాలి. ఆనాడు ప్రధాని పీవీ నరసింహారావుకు ఎన్టీఆర్‌ మద్దతు ఇచ్చారు. నంద్యాల ఉప ఎన్నికలో పీవీపై పోటీ పెట్టకుండా గెలిపించారు. తెలుగువాడు అత్యున్నత స్థానంలో ఉండాలనే భావనతో సహకరించారు. ఇప్పుడు మరోసారి తెలుగు నేతలంతా ఎన్టీఆర్‌ స్ఫూర్తితో సహకరించాలి. జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి రైతు కుటుంబం నుంచి వచ్చారు. న్యాయమూర్తిగా, లోకాయుక్తగా దేశానికి సేవలందించారు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

CM Revanth Reddy – ఇండియా కూటమి నేతలు చెబితే కేసీఆర్‌ను కలుస్తా

మీడియాతో ఇష్టాగోష్ఠి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థి గెలుపుకోసం మాజీ సీఎం కేసీఆర్‌ను కలుస్తారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సీఎం సమాధానం ఇచ్చారు. ‘‘ఇండియా కూటమి నేతలు చెబితే కేసీఆర్‌ను కలుస్తా. ఆయన ఆస్పత్రిలో ఉన్నప్పుడు నేనే వెళ్లి కలిశాను. కానీ, ప్రస్తుతం అపాయింట్‌మెంట్‌ ఇస్తారో… లేదో తెలియదు. పార్టీలకు అతీతంగా జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆత్మప్రభోదానుసారం ఓట్లు వేయాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

Also Read : Singareni: సింగరేణికి బంగారు అవకాశం వచ్చింది – సీఎండీ బలరామ్‌

Leave A Reply

Your Email Id will not be published!