CM Revanth Reddy: తెలంగాణలో ‘స్టాన్‌ఫర్డ్‌’ శాటిలైట్‌ సెంటర్‌ ఏర్పాటు – సీఎం రేవంత్

తెలంగాణలో ‘స్టాన్‌ఫర్డ్‌’ శాటిలైట్‌ సెంటర్‌ ఏర్పాటు - సీఎం రేవంత్

CM Revanth Reddy: అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… పెట్టుబడులే లక్ష్యంగా పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నైపుణ్యం, జీవశాస్త్రాల విశ్వవిద్యాలయాల్లో భాగస్వామ్యం కోసం పలు యూనివర్శిటీలను ఆయన సందర్శిస్తున్నారు. దీనిలో భాగంగా అమెరికాలో స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి తదితరులు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా అమెరికాలోని ప్రసిద్ధ స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ బయోడిజైన్‌ శాటిలైట్‌ సెంటర్‌ ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) కోరారు. అమెరికా పర్యటనలో భాగంగా శనివారం సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఇతర ప్రతినిధుల బృందంతో కలిసి కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీని సందర్శించారు. స్టాన్‌ఫర్డ్‌ బయోడిజైన్‌ సెంటర్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న న్యూ లైఫ్‌ సైన్సెస్, యంగ్‌ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయాల్లో భాగస్వామ్యం కావాలని, ఉమ్మడిగా పరిశోధనలు చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో బయోడిజైన్‌ శాటిలైట్‌ సెంటర్‌ ఏర్పాటుపైనా చర్చించారు. తెలంగాణకు తగిన సహకారం అందిస్తామని బయోడిజైన్‌ విభాగం అధిపతులు అనురాగ్‌ మైరాల్, జోష్‌ మేకోవర్‌ ప్రకటించి, ఆసక్తి వ్యక్తీకరణ లేఖను అందించారు. భారీ వైద్య పరికరాల పరిశ్రమ అభివృద్ధి ద్వారా రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థ జొయిటిస్‌ హైదరాబాద్‌లో కేపబిలిటీ సెంటర్‌ను విస్తరించి, సెప్టెంబరు నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించింది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) శనివారం ఈ కంపెనీని సందర్శించగా కంపెనీ ప్రతినిధులు కీత్‌ సర్‌బాగ్, అనిల్‌ రాఘవ్‌లు తమ నిర్ణయాన్ని వెల్లడించారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులు సైతం చర్చల్లో పాల్గొన్నారు. భారత్‌ లో తమ కంపెనీ విస్తరణకు హైదరాబాద్‌ అనువైన ప్రాంతమని, తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని జోయిటిస్‌ కంపెనీ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ కీత్‌ సర్‌బాగ్‌ తెలిపారు. తెలంగాణలో అందుబాటులో ఉన్న ప్రపంచస్థాయి మానవ వనరులను సద్వినియోగం చేసుకుంటామని జొయిటిస్‌ ఇండియా కేపబిలిటీ సెంటర్‌ ఉపాధ్యక్షుడు అనిల్‌ రాఘవ్‌ అన్నారు.

తమ కంపెనీ 70 ఏళ్లుగా జంతువుల అనారోగ్యం, రోగ నిర్ధారణ, చికిత్స సంబంధిత అంశాలపై పని చేస్తోందని, తమ కేపాబిలిటీ సెంటర్‌ విస్తరణ ద్వారా వందల మందికి కొత్తగా ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. వారి నిర్ణయాన్ని సీఎం స్వాగతించారు. ఫ్యూచరిస్టిక్‌ టెక్నాలజీలో జోయిటిస్‌ రంగ ప్రవేశం హైదరాబాద్‌కు మరింత గుర్తింపు తెస్తుందన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, జొయిటిస్‌ కంపెనీ విస్తరణతో కొత్త ఉద్యోగాలతోపాటు జంతు ఆరోగ్య సంరక్షణలో మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. స్టాన్‌ఫర్డ్‌తో భాగస్వామ్యం తెలంగాణ యువత భవితకు కొత్త బాటలు వేస్తుంది. ఇది రాష్ట్ర అభివృద్ధికే కాకుండా యావత్‌ ప్రపంచంలోని ఆరోగ్యసంరక్షణ రంగంలో కీలకంగా నిలుస్తుంది. ఇప్పటికే దేశంలో పరిశ్రమలు, కొత్త ఆవిష్కరణల్లో తెలంగాణ ముందంజలో ఉంది. స్టాన్‌ఫర్డ్‌ బయోడిజైన్‌ లాంటి ప్రపంచస్థాయి విభాగాలు కలిసి వస్తే నైపుణ్యాభివృద్ధిలో ఆశించిన లక్ష్యం నెరవేరుతుందని సీఎం రేవంత్ అన్నారు.

CM Revanth Reddy – గూగుల్‌ ప్రతినిధులతో సమావేశమైన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు

కాలిఫోర్నియాలోని గూగుల్‌ ప్రధాన కార్యాలయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) బృందం సందర్శించింది. రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనలో సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లను వినియోగించుకోవడం ఎలా..? అనే అంశాలపై గూగుల్‌ ప్రతినిధులతో సీఎం చర్చించారు. కాలిఫోర్నియాలో సీఎం రేవంత్‌ అమెరికాలోని ప్రవాస భారతీయ ప్రొఫెసర్, వాణిజ్య సలహాదారు రామ్‌చరణ్‌తోనూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ని తెలంగాణకు రావాలని సీఎం ఆహ్వానించారు.

Also Read : Californium: బిహార్‌ లో రూ.850 కోట్లు విలువైన 50 గ్రాముల కాలిఫోర్నియం స్వాధీనం !

Leave A Reply

Your Email Id will not be published!