CM Siddaramaiah: ముడా స్కామ్ కలకలం వేళ.. సిద్ధరామయ్యకు హైకోర్టులో ఊరట !
ముడా స్కామ్ కలకలం వేళ.. సిద్ధరామయ్యకు హైకోర్టులో ఊరట !
CM Siddaramaiah: కర్ణాటక రాజకీయాల్లో ముడా స్కామ్ కలకలం సృష్టిస్తోన్న తరుణంలో… హైకోర్టులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఊరట లభించింది. ఆ కుంభకోణానికి సంబంధించి తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరు చేయడాన్ని సీఎం హైకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోవద్దని ట్రయల్ కోర్టును ఉన్నతన్యాయస్థానం ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణ ఆగస్టు 29న జరగనుంది. అప్పటివరకు వరకు తాత్కాలిక రక్షణ అమల్లో ఉండనుందని తెలిపింది.
CM Siddaramaiah Muda Scam Case..
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం ముడా సేకరించింది. పరిహారంగా ఆమెకు మైసూరు- విజయనగరలో స్థలాలు కేటాయించింది. సీఎం మౌఖిక ఆదేశాలతో ముడా అధికారులు ఆమెకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారని విపక్ష బీజేపీ, జేడీఎస్ ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు అనుమతిస్తూ గవర్నర్ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే గవర్నర్ ఉత్తర్వులను నేడు సిద్ధరామయ్య హైకోర్టులో సవాల్ చేశారు.
ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి స్పందించారు. ‘‘నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. ఇప్పటివరకు ఎలాంటి తప్పు చేయలేదు. భవిష్యత్తులోనూ చేయను. నా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు బీజేపీ, జేడీఎస్‌లు కుట్ర పన్నాయి. రాజకీయంగా సవాళ్లు ఎదురైనప్పుడు మరింత ఉత్సాహంగా పనిచేస్తా. ఇటువంటివి నిరంతరం ఎదుర్కొంటూనే ఉన్నా’’ అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు.
Also Read : CM Nitish Kumar: చెట్టుకు రాఖీ కట్టిన బీహార్ సీఎం నీతీశ్ !