CM Siddaramaiah: ట్రాఫిక్ రద్దీపై విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీకి సీఎం లేఖ
ట్రాఫిక్ రద్దీపై విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీకి సీఎం లేఖ
CM Siddaramaiah : బెంగళూరులో ట్రాఫిక్ రద్దీపై తీవ్ర విమర్శలు వస్తుండడంతో రద్దీని నియంత్రించేందుకు సిద్ధరామయ్య సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీకి సీఎం లేఖ రాశారు. బెంగళూరులోని విప్రో క్యాంపస్ లోపలి నుంచి కొన్ని వాహనాలను అనుమతించాలని కోరారు. దీనివల్ల ఆ చుట్టుపక్కల రహదారులపై ట్రాఫిక్ రద్దీ 30శాతం తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొద్ది మొత్తంలో వాహనాలను అనుమతించినా ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు గణనీయమైన ఉపశమనం కలుగుతుందని సిద్ధరామయ్య (CM Siddaramaiah) లేఖలో పేర్కొన్నారు.
ఐటీ సంస్థలకు నెలవైన బెంగళూరులోని ఔటర్ రింగ్ రోడ్డులో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతుండడంపై ప్రయాణికులు, పౌర సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బెంగళూరులో రోడ్ల పరిస్థితిపై ‘బ్లాక్‌బక్’ అనే కంపెనీ సీఈవో రాజేశ్ యాబాజీ పెట్టిన పోస్టు తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ‘గతంలో ఇంటినుంచి కార్యాలయానికి వెళ్లి రావడం తేలికగా ఉండేది. ఇప్పుడు అది కఠినంగా మారిపోయింది. ఆఫీసుకు రావాలంటే మా ఉద్యోగులకు గంటన్నర పడుతుంది. రహదారులన్నీ గుంతలు, దుమ్ముతో నిండిపోయాయి. గత ఐదేళ్లలో ఈ పరిస్థితుల్లో మార్పేమీ రాలేదు. మేము ఇక్కడినుంచి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాం’ అంటూ రాజేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్టుపై పలువురు నేతలు సైతం స్పందిస్తుండడంతో రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read : Minister Satya Kumar: గిరిజన ప్రాంతాల్లో 90% వైద్యుల పోస్టుల భర్తీ – మంత్రి సత్యకుమార్
బెంగళూరులో గుంతల రోడ్లపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బెంగళూరులోని అన్ని రహదారులపై మరమ్మతులు చేయడానికి అధికారులకు నెల రోజుల గడువు విధించారు. గడువు లోపు పనులు పూర్తి చేయకపోతే చీఫ్ ఇంజినీర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని సీఎం హెచ్చరించారు. ఈ క్రమంలోనే తాజాగా విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీకి లేఖ రాశారు.
CM Siddaramaiah – ప్రధాని ఉండే రోడ్డులోనూ గుంతలు – డీకే శివకుమార్
భారీ వర్షాలు, నిర్వహణ లోపాలతో గుంతలమయమైన బెంగళూరు రోడ్లపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఈ సమస్యపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) మరోసారి స్పందించారు. ఈసందర్భంగా గుంతల సమస్య దేశమంతటా ఉందని, ప్రధాని మోదీ ఉండే రోడ్డులో కూడా ఉందని వ్యాఖ్యానించారు. ‘నేను నిన్న దిల్లీలో పర్యటించాను. ప్రధానమంత్రి నివాసానికి వెళ్లే రహదారిపై కూడా గుంతలు ఉన్నాయి. కేవలం బెంగళూరునే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ గుంతల సమస్య దేశమంతటా ఉందని పెద్ద ఐటీ కంపెనీలకు చెప్పాలనుకుంటున్నా. వాటిని పూడ్చడమే మన కర్తవ్యం. మీడియా కూడా ఈ సమస్య కేవలం కర్ణాటకలోనే ఉన్నట్లు చూపిస్తోంది. బీజేపీ అంతా సరిగ్గా చేస్తే.. రోడ్లు ఇలా ఎందుకు ఉంటాయి’ అని డీకే వ్యాఖ్యానించారు. ఈసందర్భంగా భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ.. పౌర బృందాలు రోజుకు వేల గుంతలు పూడ్చుతున్నారని తెలిపారు.
బెంగళూరులో రోడ్ల పరిస్థితిపై ‘బ్లాక్‌బక్’ అనే కంపెనీ సీఈవో రాజేశ్ యాబాజీ పెట్టిన పోస్టు తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. రహదారులన్నీ గుంతలు, దుమ్ముతో నిండిపోయాయని ఆయన పేర్కొన్నారు. గత ఐదేళ్లలో పరిస్థితిలో మార్పేమీ రాలేదని, ఇక్కడినుంచి తాము వెళ్లిపోదామని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. దీనిపై డీకే స్పందిస్తూ.. ఇలాంటి బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌ను ప్రభుత్వం కనీసం పట్టించుకోదంటూ ఘాటుగా బదులిచ్చారు. రోడ్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.1,100 కోట్లు కేటాయించిందని వెల్లడించారు.
Also Read : YSRCP: ఎమ్మెల్సీ నాగబాబు ప్రశ్నకు వైసీపీ వాకౌట్
