Waqf Bill: వక్ఫ్‌ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్, ఎంఐఎం

వక్ఫ్‌ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్, ఎంఐఎం

Waqf Bill : భారత పార్లమెంటు ఉభయసభలూ ఆమోదించిన వక్ఫ్‌ (సవరణ) బిల్లు-2025ను ను సవాల్ చేస్తూ కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. బిహార్‌లోని కిషన్‌గంజ్‌ కాంగ్రెస్‌(Congress) ఎంపీ మహ్మద్‌ జావేద్‌(బిహార్‌), ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వేర్వేరుగా ఈ పిటిషన్లు దాఖలు చేశారు. వక్ఫ్‌పై ఏర్పాటైన జేపీసీలో వీరిద్దరూ సభ్యులు కూడా. ఈ బిల్లు ముస్లింల పట్ల వివక్ష చూపుతోందని… వారి మతపరమైన స్వేచ్ఛను అడ్డుకునేలా ఉందని… వక్ఫ్‌ ఆస్తులు, నిర్వహణపై నియంత్రణ విధిస్తోందని జావేద్‌ తరఫు న్యాయవాది అనాస్‌ తన్వీర్‌ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ బిల్లు నిబంధనలు ముస్లిం సమాజ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయని అసదుద్దీన్‌ పేర్కొన్నారు.

Congress, MIM Meet Waqf Bill

పార్లమెంట్ లో రెండు ఉభయ సభల్లో రెండు రోజుల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ, తీవ్రస్థాయి వాదోపవాదాల అనంతరం వక్ఫ్‌ (సవరణ) బిల్లు–2025పై పార్లమెంటు ఆమోదముద్ర పడింది. విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్యే లోక్‌సభ బుధవారం ఈ బిల్లును ఆమోదించడం తెలిసిందే. అది గురువారం రాజ్యసభ ఆమోదం కూడా పొందింది. 13 గంటలకు పైగా జరిగిన చర్చ అనంతరం అర్ధరాత్రి ఒంటి గంట దాటాక ఓటింగ్‌ ప్రక్రియ సుదీర్ఘంగా జరిగింది. వక్ఫ్ బిల్లుకు(Waqf Bill) 128 మంది సభ్యుల నుండి స్పష్టమైన మద్దతు లభించింది. వీరిలో ఐదుగురు బీజేడీ ఎంపీలు, వైసీపీ ఎంపీ పరిమళ్‌ నత్వానీ కూడా ఉన్నారు. రాజ్యసభలో 9 ఖాళీలు ఉండగా… సభలో 236 మంది మిగిలారు. వీరిలో 128 మంది బిల్లుకు మద్దతుగా, 95 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. 13 మంది గైర్హాజరయ్యారు. వక్ఫ్‌ బిల్లును కేంద్రం ఇక రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. రాష్ట్రపతి సంతకం అనంతరం అది చట్టంగా రూపుదాల్చుతుంది. వక్ఫ్‌ బిల్లును లోక్‌సభ 288–232 ఓట్లతో ఆమోదించడం తెలిసిందే.

వక్ఫ్ బిల్లు ఆమోదంపై భారీ ఎత్తున నిరసనలు

పార్లమెంట్ లో వక్ఫ్(Waqf Bill) సవరణ బిల్లుకు ఆమోదం ముద్ర పడిన కొన్ని గంటల వ్యవధిలోనే దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. పార్లమెంట్ లో ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్, తమిళనాడులో నిరసన గళం వినిపిస్తూ నిరసనకు దిగాయి ముస్లిం సంఘాలు. ‘వక్ఫ్ సవరణ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం’ అంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కతా, తమినాడులోని చెన్నై, గుజరాత్ లోని అహ్మదాబాద్ లో భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళలన్నీ జాయింట్ ఫారమ్ ఆఫ్ వక్ఫ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలోని జరిగినట్లు జాతీయ న్యూస్ ఏజెన్నీ ఏఎన్ఐ తెలిపింది. వక్ఫ్ బిల్లుపై నిరసన కార్యక్రమం అహ్మదాబాద్ లో తీవ్రరూపం దాల్చింది. రోడ్లపై కూర్చొని పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే పోలీసులు వారిని బలవంతంగా తొలగించే ప్రయత్నం చేసే క్రమంలో అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది.

తమినాడులో విజయ్ పార్టీ నిరసన

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇటీవలే పార్టీ స్థాపించిన ‘తమిళగ వెట్రి కజగం’… వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో చెన్నై కోయంబత్తూర్, తిరుచిరాపల్లి వంటి ప్రధాన నగరాల్లో టీవీకే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వక్ఫ్ బిల్లును వ్యతిరేకించారు. చేతిలో ఫ్లకార్డులతో తమ నిరసన తెలిపారు. ముస్లింల హక్కులను హరించవద్దు అంటూ నిరసన వ్యక్తమైంది.

Also Read : CM Pinarayi Vijayan: కేరళ సీఎం విజయన్‌ కుమార్తె వీణపై విచారణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Leave A Reply

Your Email Id will not be published!