Congress BC Leaders: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిసిన కాంగ్రెస్ బీసీ నేతలు
గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిసిన కాంగ్రెస్ బీసీ నేతలు
Congress : బీసీలకు రాజకీయ, విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ఉభయ సభల్లో చేసిన బిల్లుకు గవర్నర్ ఆమోదం పొంది రాష్ట్రపతికి పంపినందుకు కాంగ్రెస్ బీసీ నేతలు శుక్రవారం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిసి ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం ఉదయం రాజ్‌భవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, కేకే, మధుయాష్కీ నేతృత్వంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిశారు. ఇంకా గవర్నర్‌ను కలిసిన వారిలో ప్రభుత్వ విప్ బీర్ల ఆయిలయ్య, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, ప్రకాష్ గౌడ్, మేయర్ విజయలక్ష్మి తదితరలు ఉన్నారు.
Congress BC Leaders Meet
గవర్నర్ ను కలిసిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం.. కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ కృషి ఫలితమేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కులగణన చేసి ప్రామాణికంగా స్పష్టమైన లెక్కల్ని వెల్లడించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎవరెన్ని మాట్లాడినా… కాంగ్రెస్ పార్టీ(Congress) ఒత్తిడి వల్లే కేంద్రం జనగణన, కులగణన చేపడుతోందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. చౌకబారు విమర్శలు చేసేవారు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. కులగణనను తాము ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ విజయశాంతి, కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, మధుయాష్కి తదితరులు ఉన్నారు.
స్థానిక సంస్థలు, విద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) మార్చి 18న శాసనసభలో ప్రవేశపెట్టిన రెండు బిల్లులు ఆమోదం పొందాయి. ఆ మరుసటి రోజు వాటిని శాసన మండలిలో ప్రవేశపెట్టి ఆమోదంపొందిన అనంతరం వాటిని ప్రభుత్వం గవర్నర్‌కు పంపారు. ఆయన వాటిని పరిశీలించి… రాష్ట్రపతికి పంపారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ను కలిసిన కాంగ్రెస్ బీసీ నేతలు ధన్యవాదాలు తెలిపారు.
‘తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ (విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు) బిల్లు-2025’, ‘తెలంగాణ బీసీ (స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు) బిల్లు-2025’ను మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలకు ఉన్న రిజర్వేషన్లు 29 శాతం. వాటిని 42 శాతానికి పెంచుతూ ఆమోదించిన బిల్లు చట్ట రూపం దాల్చాలంటే… పార్లమెంటులో 2/3 మెజారిటీతో వాటికి ఆమోదం పొందాల్సి ఉంది. ఇందుకు కారణం… సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పులే. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలందరికీ అమలు చేసే రిజర్వేషన్లన్నీ కలిపి 50 శాతాన్ని మించకూడదని గతంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఒకవేళ… రిజర్వేషన్లను పెంచితే వాటిని రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చాల్సి ఉంటుంది. అందుకే… రాజ్యాంగంలోని ఆర్టికల్ 31 (సి) ప్రకారం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతున్నట్టు బిల్లుల్లో పేర్కొంది. న్యాయ సలహా తీసుకుని రాష్ట్రపతి వాటిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అవి చట్టపరంగా నిలబడాలంటే మాత్రం.. బిల్లులను పార్లమెంటు ఉభయ సభలు 2/3 మెజారిటీతో ఆమోదించాలి. అప్పుడు మాత్రమే అవి రాజ్యాంగంలోని షెడ్యూల్-9లో చేరి, వాటికి రాజ్యాంగ రక్షణ లభిస్తుంది.
Also Read : Kaleshwaram Scam: కాలేశ్వరం ప్రాజెక్టు స్కామ్ లో హరిరామ్‌ను కస్టడీకి తీసుకున్న ఏసీబీ