CP Radhakrishnan: ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం
ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం
CP Radhakrishnan : ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) ఘన విజయం సాధించారు. మొత్తం 781 మంది సభ్యులకుగాను… 767 మంది పార్లమెంట్ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత రాష్ట్ర సమితి, బీజేడీ, శిరోమణి అకాళీదళ్ సభ్యులు ఓటు వేయలేదు. ఉప రాష్ట్రపతి అభ్యర్థులుగా ఎన్డీయే తరఫున సీపీ రాధా కృష్ణన్ (CP Radhakrishnan), విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి పోటీ చేశారు. అయితే ఉపరాష్ట్రపతి కోటా విజయానికి కావాల్సి ఓట్లు 377 కాగా… రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పోలయ్యాయి. పోలైన మొత్తం ఓట్లలో 15 చెల్లనివిగా గుర్తించారు. దీనితో 152 ఓట్ల మెజార్టీతో రాధాకృష్ణన్ గెలుపొందినట్టు రాజ్యసభ సెక్రటరీ ప్రకటించారు. పార్లమెంట్ నూతన భవనంలోని ‘ఎఫ్-101 వసుధ’లో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్… సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు.
భారత 17వ ఉప రాష్ట్రపతిగా ఘన విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రపురం పొన్ను స్వామి రాధాకృష్ణన్. 1957 అక్టోబరు 20న తమిళనాడులోని తిరుప్పూర్‌లో ఆయన జన్మించారు. తమిళనాడు నుంచి ఉప రాష్ట్రపతి పీఠం అధిష్ఠించనున్న మూడో వ్యక్తిగా రాధాకృష్ణన్ గుర్తింపు పొందారు. బలమైన సంఘ్ నేపథ్యమున్న తమిళనాడు నేత సి.పి.రాధాకృష్ణన్… కమలం పార్టీకి కొరుకుడు పడని రాష్ట్రాల్లోనూ విజయాలు సాధించిన చరిత్ర ఆయనకు ఉంది. పార్టీకి అత్యంత విధేయుడిగా పేరుంది. ధన్‌ఖడ్ రాజీనామాతో ఏర్పడిన ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవడానికి బీజేపీ ఆయన్ను ఎంచుకొంది. ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలిపి గెలిపించింది.
CP Radhakrishnan – టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ నుండి ఉపరాష్ట్రపతిగా
1957 అక్టోబర్ 20న తమిళనాడులోని తిరుప్పుర్‌లో సి.కె.పొన్నుస్వామి-జానకి దంపతులకు రాధాకృష్ణన్ జన్మించారు. ఆయన కాలేజీ సమయంలో టేబుల్ టెన్నిస్ ఛాంపియన్. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌ను పూర్తి చేశారు. రాధాకృష్ణన్ లాంగ్ డిస్టెన్స్ రన్నర్ కూడా. రాధాకృష్ణన్ (CP Radhakrishnan) 16 ఏళ్ల వయసులో తొలిసారి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS), భారతీయ జన సంఘ్ సంస్థలతో కలిసి పనిచేశారు. ఆయన 1974లో సంఘ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా కూడా వ్యవహరించారు.
ఆ తర్వాత బీజేపీ ను స్థాపించడంతో దానిలో చేరారు. 1998 లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు కోయంబత్తూర్ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ (BJP) టికెట్‌పై పోటీ చేసి 1.5 లక్షల ఆధిక్యంతో విజయం సాధించారు. డీఎంకే నేత రామనాథన్‌ను నాడు ఓడించారు. ఆ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి గెలిచిన ముగ్గురు బీజేపీ ఎంపీల్లో రాధాకృష్ణన్ కూడా ఒకరు. రాజకీయ మార్పుల కారణంగా 1999లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆయన 55,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. రెండు సార్లు అటల్ బిహారీ వాజ్‌పేయీ సర్కారులో కేంద్రం మంత్రి అవకాశం త్రుటిలో చేజారింది. అయినప్పటికీ నాటి ప్రధానికి సన్నిహితుడిగా ఆయనకు పేరుంది.
ఐక్యరాజ్యసమితి 58 సెషన్‌లో పాల్గొన్న పార్లమెంటరీ బృందంలో ఆయన సభ్యుడు. 2003 అక్టోబరులో ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. మానవీయ, విపత్తు సహా సమన్వయంపై నాడు మాట్లాడారు. 2004 తర్వాత నుంచి ఆయన తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించలేదు. బీజేపీ తమిళనాడు శాఖకు ఆయన 2004, 2007లో రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.
రాధాకృష్ణన్ సేవలను గుర్తించిన మోదీ సర్కారు 2023లో ఝార్కండ్ గవర్నర్‌గా నియమించింది. దాదాపు ఏడాదిన్నర అక్కడ పనిచేసిన తర్వాత గతేడాది మార్చిలో తమిళసై సౌందర రాజన్ రాజీనామాతో తెలంగాణ, పుదుచ్చేరి బాధ్యతలను ఆయనకే అప్పగించారు. కానీ, జులైలో ఆయన్ను మహారాష్ట్రకు పూర్తి స్థాయి గవర్నర్‌గా నియమించారు. మిగిలిన రాష్ట్రాల బాధ్యతలను ఇతరులకు అప్పగించారు.
జగదీప్ ధనఖడ్ రాజీనామాతో బరిలో దిగిన రాధాకృష్ణన్
హఠాత్తుగా ఆరోగ్య కారణాలను సాకుగా చూపుతూ ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడం అధికార ఎన్డీయేను ఇబ్బందికి గురి చేసింది. ఆయన వ్యవహార శైలి కారణంగా ప్రభుత్వంతో సంబంధాలు దెబ్బతిన్నాయనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పార్టీకి అత్యంత నమ్మకస్థుడైన రాధాకృష్ణన్‌ను ఆ స్థానం భర్తీ చేసేందుకు ఎంపిక చేశారు. ఎన్డీయే పక్షాల మద్దతుతో ఆయన విజయం నల్లేరు మీద నడకలా సాగింది.
Also Read : Pakistan: ప్రధాని, ఆర్మీ చీఫ్ మధ్య వైరం అంటూ పాకిస్తాన్ ఫేక్ ప్రచారం
