MS Dhoni : ఎంఎస్ ధోని ఐపీఎల్ పార్టిసిపేషన్ పై క్లారిటీ ఇచ్చిన సీఎస్కే

కాగా ఐపీఎల్ 2024 తన చివరిదని ఎంఎస్ ధోనీ ప్రకటించాడు...

MS Dhoni : ఐపీఎల్ మెగా వేలానికి సమయం ఆసనమవుతున్న వేళ.. దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ భవితవ్యం ఏమిటి? అనే ఉత్సుకత క్రికెట్ అభిమానుల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ అతడిని రిటెయిన్ చేసుకుంటుందా లేదా అనే ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్ 31 లోగా రిటెన్షన్ ఆటగాళ్ల జాబితా అందించాల్సి ఉండడంతో ఈ ఆసక్తి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని కనీసం మరొక్క ఐపీఎల్‌(IPL) సీజన్ అయినా ఆడాలని చెన్నై సూపర్ కింగ్స్ కోరుకుంటోందని కాశీ విశ్వనాథన్ పునరుద్ఘాటించారు. అయితే మనుపటి మాదిరిగా తన భవితవ్యంపై ధోనీ పెదవి విప్పడం లేదని ఆయన చెప్పారు. ‘‘ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఎంఎస్ ధోనీ ఆడాలని మేము కూడా ఆశిస్తున్నాం. కానీ ఈ విషయాన్ని ధోనీ మాకు ఇంకా నిర్ధారించలేదు. అక్టోబర్ 31 లోపు చెబుతానని ధోనీ చెప్పాడు. కాబట్టి అతడు ఆడాలని ఆశిద్దాం’’ అని ఓ కార్యక్రమంలో కాశీ విశ్వనాథన్ చెప్పారు.

MS Dhoni Game..

కాగా ఐపీఎల్ 2024 తన చివరిదని ఎంఎస్ ధోనీ(MS Dhoni) ప్రకటించాడు. అయితే గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేఆఫ్‌లకు చేరుకోలేకపోయింది. దీంతో ధోనీ ప్రణాళికల్లో మార్పులు ఏమైనా ఉండొచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. ఇదిలావుంచితే గత ఐదేళ్లలో అంతర్జాతీయ క్రికెట్‌ ఆడని ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు ‘అన్‌క్యాప్డ్ ప్లేయర్ రూల్’ను తిరిగి తీసుకురావడం, రూ.4 కోట్లకే దక్కించుకునే అవకాశం యాజమాన్యాలకు లభించడంతో ఎంఎస్ ధోనీని సీఎస్కే దక్కించుకోవచ్చంటూ జోరుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి.

ప్రతి జట్టూ ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లను దక్కించుకునే ఛాన్స్ ఉండడంతో ధోనీని దక్కించుకోవడం ఖాయమనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. కాగా 2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ చివరిసారిగా భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2019 జులై నెలలో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. కాగా గత ఐపీఎల్ సీజన్‌లో సూపర్ కింగ్స్ తరఫున ధోనీ మొత్తం 14 మ్యాచ్‌లు ఆడాడు. 220 స్ట్రైక్ రేట్‌తో 161 పరుగులు బాదాడు. ఇక సీఎస్కే టైటిల్ గెలిచిన 2023 సీజన్‌లో ధోనీ 82.46 స్ట్రైక్ రేట్‌తో 104 పరుగులు కొట్టాడు. ధోనీకి వయసు మీద పడినప్పటికీ అతడి ఆటని మైదానంలో చూడాలని అభిమానులు కోరుకుంటున్న విషయం తెలిసిందే.

Also Read : MP CM Ramesh : జగన్ 5 ఏళ్ల పాలనలో పల్లెల్లో అభివృద్ధి మాటే లేదు

Leave A Reply

Your Email Id will not be published!