Daggubati Venkateswara Rao: దగ్గుబాటి రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకం ఆవిష్కరించిన చంద్రబాబు

దగ్గుబాటి రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకం ఆవిష్కరించిన చంద్రబాబు

 

తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌, ఎంపీ పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును సీఎం చంద్రబాబు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. చంద్రబాబు, దగ్గుబాటి కుటుంబాలు కొన్నేళ్లుగా కుటుంబ కార్యక్రమాల్లో కలుస్తున్నా… ఇద్దరూ ఒకే బహిరంగ వేదికపైకి రావడం 30 ఏళ్లలో ఇదే మొదటిసారి.

ఈ సందర్భంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… ప్రపంచ చరిత్రపై పుస్తకం రాసేందుకు చాలా విషయాలు తెలుసుకోవాల్సి వచ్చిందన్నారు. ప్రపంచ నేతలు, తత్వవేత్తల గురించి పూర్తిగా అధ్యయనం చేసినట్లు తెలిపారు. ‘‘ఈ పుస్తకం ఎలా రాశావని చాలా మంది నన్ను అడిగారు. రచనకు ముందు చాలా కృషి జరిగింది. నేను సైన్స్‌ స్టూడెంట్‌ ను… ఎంబీబీఎస్‌ చదివా. సోషల్‌ స్టడీస్‌కు సంబంధించిన అనుభవం, పరిజ్ఞానం అంతగా లేదు. చరిత్ర తెలియకుండా పుస్తకం ఎలా రాయాలని ఆలోచించా. పుస్తకాలు ఎక్కడ దొరికినా కొనేవాణ్ని. గొప్ప నాయకుల చరిత్రలు కూడా అభ్యసించడం మొదలుపెట్టా. రాష్ట్ర విభజనకు ముందు చరిత్రేంటి అనే విషయాలు తెలుసుకున్నా. ప్రపంచ చరిత్ర రాయాలంటే చాలా విషయాలు తెలుసుకోవాల్సి వచ్చింది. చరిత్ర గతినే మార్చిన మహానుభావుల పాలనపై వివరాలను సేకరించా’’ అని వెంకటేశ్వరరావు వివరించారు.

దగ్గుబాటిది ఎవరూ చేయని సాహసం – సీఎం చంద్రబాబు

 

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ‘‘దగ్గుబాటి వెంకటేశ్వరరావు నా తోడల్లుడు. ఎన్టీఆర్‌ వద్ద ఇద్దరం అన్నీ నేర్చుకున్నాం. ఆయన పుస్తకం రాస్తారని నేనెప్పుడూ అనుకోలేదు. రచయిత కానటువంటి రచయిత వెంకటేశ్వరరావు. ఎవరూ చేయని సాహసాన్ని ఆయన చేశారు. ప్రపంచ చరిత్రలో ఆది నుంచి ఇప్పటి వరకు మొత్తం వివరాలను పుస్తకంలో పొందుపరిచారు. ఎన్ని కష్టాలున్నా సంతోషంగా కనిపిస్తారు. గత ప్రభుత్వ విధ్వంస పాలనతో అందరం ఆవేదన చెందాం. గీతం వంటి ఉత్తమ విద్యాసంస్థను ఏం చేశారో చూశారు. ఇటీవల ఎన్నికల్లో దగ్గుబాటి పురందేశ్వరి చొరవను అందరం చూశాం. రాష్ట్ర ప్రజలకు మంచి చేసేందుకు అది ఉపయోగపడింది’’ అని చంద్రబాబు అన్నారు.

సరళమైన భాషలో పుస్తకం రాయడం ముదావహం – వెంకయ్యనాయుడు

తెలుగులో దగ్గుబాటి రాసిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రాబోయే తరాలకు జ్ఞానం, విజ్ఞానం అందించాలని మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారని… ప్రపంచ చరిత్రలో జరిగిన పరిణామ క్రమాన్ని సరళమైన భాషలో తీసుకురావడం ముదావహమని కొనియాడారు. భారత చరిత్రను కూడా రాయాలని ఈ సందర్భంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావును వెంకయ్య కోరారు.

ట్రంప్‌ పాలన గురించీ రాయాలి – నిర్మలా సీతారామన్‌

 

భారత దేశచరిత్రలో విజయాలు సాధించిన ఎందరి గురించో మనం విన్నామని… అలాంటి గాథలను ఒక చోట చేర్చి వెంకటేశ్వరరావు పుస్తకం రాశారని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. మరింత అధ్యయనం చేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పాలన సహా అన్ని విషయాలు రాయాలని ఆమె కోరారు.

Leave A Reply

Your Email Id will not be published!