Delhi Bomb Threats: ఢిల్లీలో బాంబుల కలకలం ! దాదాపు 100 స్కూళ్లకు బాంబు బెదిరింపులు !

ఢిల్లీలో బాంబుల కలకలం ! దాదాపు 100 స్కూళ్లకు బాంబు బెదిరింపులు !

Delhi Bomb Threats:దేశ రాజధాని ఢిల్లీ బాంబు బెదిరింపులతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బుధవారం ఉదయం ఢిల్లీ((Delhi))-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలోని పలు స్కూళ్లకు బెదిరింపు మెయిల్‌ వచ్చింది. అప్రమత్తమైన స్కూల్‌ యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాయి. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలను ఖాళీ చేయించాయి. పోలీసులు వెంటనే ఆయా స్కూళ్లకు వెళ్లి బాంబ్‌ స్క్వాడ్‌ లతో క్షుణ్ణంగా తనిఖీలు జరిపారు. ఢిల్లీలోని ద్వారక, చాణక్యపురి, మయూర్‌ విహార్‌, వసంత్‌ కుంజ్‌, సాకేత్‌ స్కూళ్లకు తొలుత ఈ బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత రాజధానితో పాటు నోయిడాలోని దాదాపు 100 పాఠశాలలకు బెదిరింపు ఈ-మెయిల్‌ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని స్కూళ్లలో ఈ రోజు పరీక్షలు జరుగుతున్నాయి. బెదిరింపుల నేపథ్యంలో వాటిని మధ్యలోనే ఆపి విద్యార్థులను ఇంటికి పంపించారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు ఆయా స్కూళ్లకు చేరుకుని పిల్లలను తీసుకెళ్లారు. వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్‌ని త్వరలో వెల్లడిస్తామని పాఠశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి.

Delhi Bomb Threats:

ఒకే సమయంలో దాదాపు 100కు పైగా స్కూళ్లను బెదిరింపులు రావడంతో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, స్కూలు యాజమాన్యాలతో పాటు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దీనిపై స్పందించింది. ‘‘ఈ బెదిరింపు మెయిల్స్‌ నకిలీ మాదిరిగానే కన్పిస్తున్నాయి. ప్రజలెవరూ కంగారుపడొద్దు. పోలీసులు, భద్రతా ఏజెన్సీలు తనిఖీలు చేపడుతున్నాయి’’ అని హోంశాఖ అధికారి వెల్లడించారు. అటు ఢిల్లీ(Delhi) పోలీసులు కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తపర్చారు. తనిఖీల్లో ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు లభించలేదని తెలిపారు. అవి నకిలీ బెదిరింపులే అయి ఉంటాయని పేర్కొన్నారు. మెయిల్‌ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

ఈ-మెయిల్ ఐపీ అడ్రస్‌లను బట్టి విదేశాల నుంచి దీన్ని పంపించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఒకే వ్యక్తి నుంచి ఈ బెదిరింపులు వచ్చి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. రష్యా నుంచి ఈ బెదిరింపులకు పాల్పడినట్లు ప్రాధమికంగా తెలుస్తోంది. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. డీసీపీ అపూర్వ గుప్తా మాట్లాడుతూ.. ఇవాళ ఉదయం నుంచి అనేక పాఠశాలలకు మెయిల్స్ వెళ్లాయి. అన్ని మెయిళ్ల సారాంశం ఒకటేనని… పాఠశాలలో బాంబు పెట్టినట్లు అందులో ఉందని తెలిపారు.

ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి మాట్లాడుతూ… విద్యార్థులు, తల్లిదండ్రులు కంగారు పడాల్సిన అవసరం లేదని… బడుల్లో బాంబును గుర్తించలేదని తెలిపారు. అవసరమైన చోట పాఠశాలల అధికారులు తల్లిదండ్రులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. ఈ మెయిల్ పంపడానికి ఉపయోగించిన ఐపీ అడ్రస్ సర్వర్ విదేశాల్లో(రష్యా) ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీలైనంత త్వరలో నిందితుడి వివరాలు తెలుసుకుంటామని చెబుతున్నారు.

Also Read:Divorce Function: పెళ్ళి వేడుకకు ధీటుగా కుమార్తె విడాకుల ర్యాలీను నిర్వహించిన తండ్రి !

Leave A Reply

Your Email Id will not be published!