Delhi LG Saxena : ప్రజల అభ్యున్నతి కోసం పని చేస్తున్నా
స్పష్టం చేసిన వినయ్ కుమార్ సక్సేనా
Delhi LG Saxena : ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా వర్సెస్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు పొసగడం లేదు. ఇద్దరూ ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. తమ ప్రభుత్వానికి ఆటంకం కలిగిస్తున్నారని, రాజ్యాంగేతర శక్తిగా మారారంటూ సీఎం ఆరోపించారు. తాము పంపించిన ఫైల్స్ ను కావాలని నిలిపి వేస్తున్నారంటూ ఆరోపించారు.
ఆయన ఎల్జీగా పని చేయడం లేదని ఫక్తు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పని చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు సీఎం కేజ్రీవాల్. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై సీరియస్ గా స్పందించారు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా(Delhi LG Saxena). సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
తాను ఏమిటో, తన పరిమితులు ఏమిటో తెలుసునని అన్నారు. తాను చదువుకున్న వ్యక్తినని, ఫైల్ వచ్చాక గుడ్డిగా అందులో ఏముందో చూడకుండా సంతకం చేసే వ్యక్తిని కాదన్నారు. అంతే కాదు దేశానికి రాజధాని అయిన ఢిల్లీ నగరం పట్ల, ఇక్కడి ప్రజల పట్ల తనకు మమకారం ఉంటుందన్నారు వినయ్ కుమార్ సక్సేనా.
పనిగట్టుకుని ఆప్ చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణలు వాస్తవం కావన్నారు. ప్రజల జీవన స్థితిగతులను మెరుగు పరిచేందుకు మాత్రమే తాను పని చేస్తున్నానని మరోసారి స్పష్టం చేశారు లెఫ్టినెంట్ గవర్నర్. ప్రభుత్వంతో గొడవల మధ్య తాను నగర ప్రజల అభ్యున్నతి కోసం పని చేస్తున్నానని వినయ్ కుమార్ సక్సేనా చెప్పారు.
తాను ప్రశ్నిస్తున్నానే తప్పా అడ్డుకోవడం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Also Read : పుల్వామా.. సర్జికల్ స్ట్రైక్ నివేదిక ఎక్కడ