Delhi School: స్కూలు ఫీజుల పెంపుపై దిల్లీ ప్రభుత్వం కొత్త చట్టం
స్కూలు ఫీజుల పెంపుపై దిల్లీ ప్రభుత్వం కొత్త చట్టం
Delhi School : ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ కోసం దిల్లీలోని (Delhi) బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. ‘ద దిల్లీ స్కూల్ (Delhi School) ఎడ్యుకేషన్ (ట్రాన్స్‌పరెన్సీ ఇన్ ఫిక్సేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఫీజ్) బిల్లు-2025’కి అసెంబ్లీ తాజాగా ఆమోద ముద్ర వేసింది. దీని ప్రకారం పాఠశాలల యాజమాన్యాలు మూడేళ్లకోసారే ఫీజులను పెంచడానికి వీలుంటుంది. పాఠశాల స్థాయి ఫీజుల నియంత్రణ కమిటీ ఆమోదించినంత మేరకే వాటి పెంపు ఉంటుంది. ఈ చట్టం దిల్లీ (Delhi) పరిధిలోని అన్ని ప్రైవేటు, అన్‌ఎయిడెడ్ పాఠశాలలకు వర్తిస్తుంది. వాటికి గుర్తింపు ఉందా.. లేదా.. అన్న నిబంధనతో సంబంధం లేదు. ప్రభుత్వం ద్వారా రాయితీ ధరల్లో భూములు తీసుకొని ఏర్పాటు చేసిన మైనారిటీ సంస్థలూ దీని పరిధిలోకి వస్తాయి.
Delhi School Fees
ఇటీవలి కాలంలో దేశ రాజధానిలోని వివిధ పాఠశాలలు… పెంచిన ఫీజులు కట్టలేదని విద్యార్థులను బహిష్కరించడం, అవమానించడంలాంటివి చేశాయి. భవిష్యత్తులో అలాంటి ఘటనల నియంత్రణ కోసం ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Gupta) నేతృత్వంలోని ప్రభుత్వం నడుం బిగించింది. దీనిలో భాగంగా ‘ద దిల్లీ స్కూల్ (Delhi School) ఎడ్యుకేషన్ బిల్లు-2025’ను రూపొందించింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి పాఠశాలా తప్పనిసరిగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కమిటీని ఏర్పాటు చేయాలి. పాఠశాల ఫీజుల నియంత్రణ కోసం ఏటా జులై 15లోగా ‘స్కూల్ లెవెల్ ఫీ రెగ్యులేషన్ కమిటీ’ని ఏర్పాటు చేయాలి. దానికి ఛైర్మన్‌గా స్కూల్ మేనేజ్‌మెంట్ ప్రతినిధి ఉంటారు. సెక్రటరీగా సదరు పాఠశాల ప్రిన్సిపల్ వ్యవహరిస్తారు. సభ్యులుగా అదే స్కూల్‌కు చెందిన ముగ్గురు టీచర్లను, పేరెంట్ టీచర్ అసోసియేషన్‌లోని ఐదుగురు తల్లిదండ్రులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు.
డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రతినిధి అబ్జర్వర్‌గా వ్యవహరిస్తారు. కమిటీ ఏర్పాటైన వారంలోగా ఇందులోని అందరి పేర్లను స్కూల్ (Delhi School) నోటీసు బోర్డులు, వెబ్‌సైట్‌లలో ఉంచాలి. తర్వాత ఒక కాపీని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నియమించిన అధికారికి పంపాలి. కమిటీలోని సభ్యుల్లో కనీసం ఒక ఎస్సీ, ఎస్టీ లేదంటే సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు చెందినవారు ఉండాలి. మహిళలూ ఇద్దరికంటే తక్కువ ఉండకూడదు. దీని కాలపరిమితి ఒక విద్యా సంవత్సరం వరకు ఉంటుంది. ఒకసారి ఈ పాఠశాల స్థాయి ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటు పూర్తయిన తర్వాత సదరు పాఠశాల యాజమాన్యం వచ్చే మూడేళ్ల కాలానికి ఫీజుల ప్రతిపాదన, దానికి సంబంధించిన రికార్డులను ఈ కమిటీకి ఏటా జులై 31లోగా పంపాలి.
యాజమాన్యం ప్రతిపాదనలను పరిశీలించి ఆమోదించే అధికారం ఈ కమిటీకి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ యాజమాన్యం ప్రతిపాదించిన దాని కంటే ఎక్కువ మొత్తం ఫీజులను నిర్ణయించే అధికారం ఈ కమిటీకి ఉండదు. యాజమాన్యం చేసిన ప్రతిపాదనల్లోని అన్ని కోణాలను పరిశీలించిన తర్వాత 30 రోజుల్లోగా కమిటీ సభ్యులు ఏకగీవ్ర అంగీకారం ద్వారా ఫీజుల పెంపునకు అమోదం తెలిపి, ఆ వివరాలను లిఖితపూర్వకంగా మేనేజ్‌మెంట్‌కు అందించాల్సి ఉంటుంది. ఈ కమిటీ ఆమోదించిన ఫీజుల వివరాలను యాజమాన్యం నోటీస్ బోర్డులు, వెబ్‌సైట్లలో బహిర్గతం చేయాలి.
కమిటీ ఆమోదించిన ఫీజులను తప్పనిసరిగా మూడేళ్లు అమలు చేయాలి. ఏయే విభాగానికి ఎంత ఫీజు నిర్ధారించిందీ పాఠశాల స్థాయి ఫీజుల నియంత్రణ కమిటీ స్పష్టం చేయాలి. కమిటీ సెప్టెంబరు 15లోగా ఫీజులను నిర్ణయించకపోతే పాఠశాల యాజమాన్యం అదే నెల 30వ తేదీలోగా జిల్లా ఫీజు అప్పిలేట్ కమిటీకి అప్పీలు చేసుకోవచ్చు. నియంత్రణ కమిటీ నిర్ధారించిన ఫీజులపట్ల అభ్యంతరాలున్న తల్లిదండ్రుల బృందం 30 రోజుల్లోగా జిల్లా ఫీ అప్పిలేట్ కమిటీకి అప్పీల్ చేసుకోవచ్చు. ఈ అప్పిలేట్ కమిటీకి జిల్లా ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ ఛైర్మన్‌గా ఉంటారు.
జోనల్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. సభ్యులుగా ఒక ఛార్టర్డ్ ఎకౌంటెంట్, సంబంధిత ప్రాంత/జిల్లా ఎకౌంట్స్ డిపార్టుమెంట్ అధికారి, పాఠశాలలు, తల్లిదండ్రుల ప్రతినిధులు ఇద్దరు చొప్పున ఉంటారు. తన ముందుకు వచ్చిన అప్పీల్‌పై 30 రోజుల్లోగా ఇది నిర్ణయం వెలువరించాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 45 రోజులకు మించడానికి వీల్లేదు. ఒకవేళ అలా జరిగితే ఆ అప్పీల్ ఆటోమేటిక్‌గా రివిజన్ కమిటీకి వెళ్తుంది. ఒకవేళ ఈ జిల్లా అప్పిలేట్ కమిటీ 30రోజుల్లోగా వెలువరించిన తీర్పుపై అభ్యంతరాలుంటే అటు మేనేజ్‌మెంట్‌గానీ, ఇటు తల్లిదండ్రులుగానీ 30రోజుల్లోగా రివిజన్ కమిటీని ఆశ్రయించవచ్చు.
విద్యా రంగానికి విశేష సేవలు అందించిన ప్రముఖ వ్యక్తి రివిజన్ కమిటీకి ఛైర్మన్‌గా ఉంటారు. సభ్యులుగా ఛార్టర్డ్ ఎకౌంటెంట్, ఎకౌంట్స్ కంట్రోలర్/డిప్యూటీ కంట్రోలర్, స్కూల్స్, తల్లిదండ్రుల ప్రతినిధుల నుంచి ఒక్కొక్కరు ఉంటారు. విద్యాశాఖ అదనపు డైరెక్టర్ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. ఈ కమిటీ 45 రోజుల్లోగా నిర్ణయం వెలువరించాల్సి ఉంటుంది. ఇది తీసుకునే నిర్ణయమే అంతిమం.
ఫీజు నిర్ధారణకు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు
స్కూల్ (Delhi School) ఉన్న ప్రాంతం. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి అందుబాటులో ఉన్న మౌలిక వసతులు. స్కూల్ వెబ్‌సైట్, ప్రాస్పెక్టస్‌లో పొందుపరిచిన సౌకర్యాలు ఎంతవరకు అందిస్తున్నారు. ఆ పాఠశాల విద్యా ప్రమాణాలు. పరిపాలన, నిర్వహణ వ్యవహారాలపై చేస్తున్న ఖర్చులు. ఎన్‌ఆర్‌ఐలు, ఇతర వ్యక్తుల నుంచి అందుకుంటున్న విరాళాలు, ఏదైనా పథకాల ద్వారా ప్రభుత్వం నుంచి అందుకుంటున్న నిధులు. బోధన, బోధనేతర సిబ్బంది అర్హతలు, వారికి చెల్లిస్తున్న వేతనాలు. వార్షిక వేతన ఇంక్రిమెంట్లు. పాఠశాల మొత్తం ఆదాయంపై విద్యార్థులపై చేస్తున్న ఖర్చులు. ఆదాయ మిగులు, ఇతరత్రా అంశాలు.
ఏదైనా పాఠశాల ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం ఫీజు నిర్ణయించకపోతే వాటిని వెంటనే రద్దుచేయాలని ఆదేశించి, పిల్లల నుంచి వసూలు చేసిన అదనపు ఫీజును 20 రోజుల్లోగా తిరిగి ఇచ్చేయాలని ఆదేశించే అధికారం జిల్లా విద్యాధికారికి ఉంటుంది.
ఏదైనా స్కూల్ (Delhi School) తొలిసారి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలవరకు జరిమానా విధిస్తారు. రెండోసారి, ఆ తర్వాత ఉల్లంఘనలకు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలవరకు జరిమానా విధిస్తారు.
జిల్లా విద్యాశాఖాధికారి జారీచేసిన ఆదేశాల మేరకు అధిక ఫీజును పిల్లలకు 20 రోజుల్లోగా తిరిగి చెల్లించకపోతే పైన పేర్కొన్న జరిమానాకు రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది. 40 రోజులు దాటితే మూడు రెట్లు, 60 రోజులు దాటితే నాలుగు రెట్ల జరిమానా వసూలు చేస్తారు.
స్కూల్ పదేపదే ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలితే తొలుత అందుకు బాధ్యుడైన వ్యక్తిని పాఠశాల యాజమాన్య విధుల నుంచి డిబార్ చేస్తుంది. లేదంటే తదుపరి సంవత్సరాల్లో ఫీజుల పెంపు ప్రతిపాదన చేయకుండా నియంత్రిస్తుంది. లేదంటే ఆ పాఠశాల గుర్తింపును సస్పెండ్ చేయడం, ఉపసంహరించడం చేస్తుంది. అంతిమంగా స్కూల్ యాజమాన్యాన్ని ప్రభుత్వమే తన చేతుల్లోకి తీసుకుంటుంది.
ఫీజులు చెల్లించలేదనో, ఆలస్యం చేస్తున్నారనో ఏ పిల్లవాడినీ వేధించకూడదు. హాజరు పట్టిక నుంచి పేర్లు తొలగించడం, పరీక్ష ఫలితాలు నిలిపేయడం, తరగతులు, ఇతర కార్యకలాపాల్లోకి అనుమతించకపోవడం, బహిరంగంగా అవమానించడం, కొట్టడంలాంటివి చేస్తే ప్రతి విద్యార్థికి రూ.50వేల చొప్పున జరిమానా విధించే అధికారం ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు ఉంటుంది.
Also Read : Visakhapatnam: విశాఖ పేలుడు ఘటన మృతులకు పరిహారం పంపిణీ చేసిన ప్రభుత్వం
