Delhi Water Crisis: ఢిల్లీలో నీటి సంక్షోభం ! పైపులైన్లకు పోలీసు పహారా ?

ఢిల్లీలో నీటి సంక్షోభం ! పైపులైన్లకు పోలీసు పహారా ?

Delhi Water Crisis: దేశ రాజధాని ఢిల్లీను నీటి సంక్షోభం చుట్టుముట్టింది. యమునా నదికి నీటి ప్రవాహం తగ్గడంతో నగరానికి నీటి ఇబ్బందులు తలెత్తాయి. నీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనితో అధికారంలో ఉన్న ఆప్‌ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో విరుచుకుపడుతున్నారు. నిరసన తెలుపుతూ ఢిల్లీ(Delhi) నీటి సరఫరా కార్యాలయం(డీజెబీ)పై దాడికి దిగారు. నిరసనకారులు మట్టి కుండలతో (మట్కా-ఫోడ్) ఆందోళనకు దిగారు. నగరంలోని నీటి ఎద్దడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయంపై దాడికి దిగారు. కిటికీలు ధ్వంసం చేశారు. ఇదే సమయంలో నీటి సరఫరా వ్యవస్థను దుండగులు ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ జల మంత్రిత్వశాఖ కీలక చర్యలకు ఉపక్రమించింది. నగరానికి వచ్చే ప్రధాన పైపులైన్లకు పహారా కాయాలని విజ్ఞప్తి చేస్తూ పోలీస్‌ కమిషనర్‌కు లేఖ రాసింది.

Delhi Water Crisis….

‘‘యమునా నదికి ప్రవాహం తగ్గింది. రోజుకు 70 మిలియన్‌ గ్యాలన్ల నీటి కొరత ఏర్పడుతోంది. దీనితో నగరంలోని చాలా ప్రాంతాలు తీవ్ర ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ప్రతి నీటిబొట్టూ విలువైంది. దాని పంపిణీ వ్యవస్థను రక్షించుకోవాలి’’ అని కమిషనర్‌కు రాసిన లేఖలో ఢిల్లీ(DelhiDelhi) మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. నగరానికి నీటిని సరఫరా చేసే ప్రధాన పైపులైన్ల వద్ద దిల్లీ జల్‌ బోర్డు ఇప్పటికే గస్తీ బృందాలను ఏర్పాటు చేసిందన్నారు. నగరానికి నీటిని పంపిణీ చేసే ప్రధాన పైపులైన్లలో అనేక చోట్ల బోల్టులను తొలగించడంతో లీకేజీలు ఏర్పడుతున్నట్లు గుర్తించామని మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. వీటి వెనక ఏదో దురుద్దేశం లేదా విధ్వంసం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నగరానికి వచ్చే నీటి పైపులను ట్యాంపరింగ్‌ చేయకుండా రక్షించేందుకు 15 రోజులపాటు గస్తీ నిర్వహించాలని పోలీస్‌ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. లేదంటే తాజా సంక్షోభం మరింత తీవ్రతరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read : KCR Letter : మాజీ సీఎం కేసీఆర్ లేఖపై స్పందించిన పవర్ కమిషన్ చైర్మన్

Leave A Reply

Your Email Id will not be published!