Delimitation: డీలిమిటేషన్ పాతికేళ్లు వాయిదా వేయాలి – జేఏసీ ఏకగ్రీవ తీర్మానం
డీలిమిటేషన్ పాతికేళ్లు వాయిదా వేయాలి - జేఏసీ ఏకగ్రీవ తీర్మానం
Delimitation : లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనను 25 ఏళ్లపాటు వాయిదా వేయాలని, ప్రస్తుతమున్న లోక్‌సభ స్థానాలను యథాతథంగా కొనసాగించాలని అధికార డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) డిమాండ్ చేసింది. డీలిమిటేషన్(Delimitation) కు వ్యతిరేకంగా స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ఏడు రాష్ట్రాల నుంచి గట్టి మద్దతు లభించింది. స్టాలిక్ కు మద్దత్తుగా మేము సైతం… అంటూ దక్షిణాదిలోని బీజేపీయేతర పార్టీలకు చెందిన పలువురు సీఎంలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, పంజాబ్ ముఖ్యమంత్రి భాగమయ్యారు. ఈ సందర్భంగా న్యాయ సమ్మతంగా పునర్విభజన జరగాలంటూ ఈ సమావేశంలో వారంతా ఏకకంఠంతో నినదించారు. అంతేకాదు ఈ పోరాటంలో స్టాలిన్(CM MK Stalin) వెంట ఉంటామని పలువురు నేతలు స్పష్టం చేశారు.
Delimitation Updates
ఒకవైపు కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ పోరాటం, మరోవైపు న్యాయపరమైన కార్యాచరణ దిశగా పని చేసేందుకు నిపుణులతో కమిటీని ఏర్పాటుచేయాలన్న స్టాలిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అందరూ ఆమోదించారు. లోక్‌సభ స్థానాల పునర్విభజనను 25 యేళ్లపాటు వాయిదా వేస్తూ, పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ() స్పష్టమైన ప్రకటన చేయాలని జేఏసీ సమావేశం తీర్మానించింది. ఎంపీ స్థానాల సంఖ్యను ఏమాత్రం తగ్గించడానికి వీల్లేదని సమావేశంలో నేతలు డిమాండ్ చేశారు. ‘పునర్విభజన వల్ల నష్టపోతామని ఆందోళన చెందుతున్న రాష్ట్రాలకు చెందిన పార్టీలను ఆహ్వానించి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం జరపాలని జేఏసీ(JAC) కేంద్రాన్ని కోరింది. పునర్విభజనను వ్యతిరేకిస్తున్న పార్టీలకు చెందిన ఎంపీలతో కోర్ కమిటీని ఏర్పాటుచేసుకుని, పార్లమెంటులో సమన్వయంతోను, స్పష్టమైన వ్యూహంతోను పనిచేయాలని నిర్ణయించింది.
జేఏసీ(JCP) సమావేశ వివరాలను డీఎంకే ఎంపీ కనిమొళి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పశ్చిమబెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధులు రావాల్సి ఉన్నా… అనివార్య కారణాల వల్ల హాజరుకాలేకపోయారని వివరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవ్వరూ రాలేదన్న ప్రశ్నకు స్పందిస్తూ… వైసీపీ నుండి ప్రతినిధులెవరూ రాకపోయినా, ఈ సమస్యపై ఆ పార్టీ నేత ప్రధానికి లేఖ రాశారని వివరించారు. ‘వైసీపీ మీతోనే ఉన్నట్లు భావిస్తున్నారా’ అని అడగ్గా… ‘ఆ విషయం మేం చెప్పడం కాదు, లేఖ రాయడం ద్వారా వారే చెప్పారు’ అని కనిమొళి వ్యాఖ్యానించారు. తదుపరి జేఏసీ సమావేశం తెలంగాణ రాజధాని హైదరాబాద్ జరుగుతుందని తెలిపారు.
అఖిలపక్ష సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారంటే
జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన శనివారం చెన్నైలో జరిగిన సమావేశానికి పలువురు ముఖ్యమంత్రులు, ప్రముఖ నాయకులు హాజరయ్యారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్(Pinaray Vijayan) (సీపీఎం), తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (కాంగ్రెస్), పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ (ఆప్), కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (కాంగ్రెస్), బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఆ పార్టీ నేతలు వినోద్‌కుమార్, సురేశ్‌రెడ్డి, మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఒడిశా మాజీ మంత్రి సంజయ్‌కుమార్ దాస్ బుర్మా, అమర్ పట్నాయక్ సింగ్ (బీజేడీ), పంజాబ్ రాష్ట్ర శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సర్దార్ బల్వీందర్ సింగ్, దల్జిత్‌సింగ్ సీమా, సీపీఐ కేరళ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వం, కాంగ్రెస్ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు కె.సుధాకరన్, ముస్లిం లీగ్ నేత పీఎంఏ సలామ్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు ఎన్‌కే ప్రేమ్‌చంద్రన్, ఎంఐఎం ప్రతినిధి ఇంతియాజ్ జలీల్, కేరళకాంగ్రెస్ (మణి) ప్రతినిధి జోస్ కె.మణి, కేరళ కొట్టాయం కాంగ్రెస్ ఎంపీ జార్జి కె.ఫ్రాన్సిస్ పాల్గొన్నారు.
జేఏసీలో ప్రవేశపెట్టిన తీర్మానాలు
1. రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్(CM MK Stalin) ముందుకొచ్చి చొరవ చూపడం అభినందనీయం. ఇది రాష్ట్రాల ఆర్థిక భవిష్యత్తుకు, రాజకీయ రక్షణకు చాలా అవసరం.
2. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై జరుగుతున్న ప్రక్రియలో పారదర్శకత లోపించింది. ఈ వ్యవహారంలో రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, ప్రముఖుల అభిప్రాయాలు విన్నాకే నిర్ణయాలు తీసుకోవాలి.
3. రాజ్యాంగంలో 42, 84, 87వ సవరణల ప్రకారం జనాభా నియంత్రణను సమర్థంగా అమలుచేసిన రాష్ట్రాలను రక్షించాలి, ప్రోత్సహించాలి. జనాభా నియంత్రణకు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాల్సి ఉన్నందున.. 1971 జనాభా ప్రాతిపదికన చేపట్టిన పార్లమెంటు స్థానాల పునర్విభజనను 25 ఏళ్లపాటు మార్చకుండా యథాతథ స్థితిని కొనసాగించాలి.
4. జనాభా నియంత్రణ లక్ష్యాలను ప్రభావవంతంగా అమలుచేసిన రాష్ట్రాలకు, పార్లమెంట్ స్థానాల పునర్విభజన శిక్షగా మారకూడదు. ఆయా రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణలు అమలు చేయాలి.
5. ఈ జేఏసీ తీర్మానాలకు విరుద్ధంగా కేంద్రం పునర్విభజనపై కసరత్తు చేస్తే, ఆ ప్రయత్నాలను ఎదుర్కొనేందుకు ఆయా రాష్ట్రాల ఎంపీలతో కోర్ కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. ఈ కమిటీతో పార్లమెంటరీ వ్యవహారాలను సమన్వయం చేసుకోవాలి. ఈ జేఏసీలోని సభ్యులు తయారుచేసిన వినతిపత్రాన్ని ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ప్రధానికి అందజేయాలి.
6. ఈ సమావేశానికి హాజరైన పార్టీలు వారివారి రాష్ట్రాల్లోని శాసనసభల్లో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తీర్మానాలు చేసి, వాటిని కేంద్ర ప్రభుత్వానికి పంపాలి.
7. రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై అక్కడి ప్రజలకు వివరించేలా అవసరమైన సమాచారాన్ని ఇవ్వడానికి జేఏసీ పాటుపడాలి. పునర్విభజన పరంగా గత చరిత్ర, పరిణామాలపై వివరాలు వెలికితీయడంతో పాటు ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఆయా రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలి.
Also Read : Supreme Court of India: జస్టిస్ వర్మపై విచారణకు త్రిసభ్య కమిటీ