Deputy CM Pawan Kalyan: అడవి తల్లి బాటపై అధికారులకు పవన్ కళ్యాణ్ సూచనలు
అడవి తల్లి బాటపై అధికారులకు పవన్ కళ్యాణ్ సూచనలు
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అడవి తల్లి బాట’ పై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘అడవి తల్లి బాట’ పేరుతో గిరిజన ప్రాంతాల్లో చేపడుతున్న రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ పనులు పూర్తయితే 625 గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యం ఏర్పాటవుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రోడ్ల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు. రెండు వారాలకు ఒకసారి శాఖాపరంగా సమీక్షించి నిర్మాణ పురోగతిపై నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, డోలీరహిత గిరిజన ఆవాసాలు ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. అధికారులందరి.. సమీష్ట కృషితోనే ఇది సాధ్యపడుతుందని చెప్పుకొచ్చారు.
Deputy CM Pawan Kalyan Comments
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పీఎం జన్‌మన్ పథకం ద్వారా రూ.555.6 కోట్లు నిధులు కేటాయించి సహకారం అందించిందని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తెలిపారు. అదే విధంగా జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించుకొంటున్నట్లు వివరించారు. ఇన్ని అవకాశాలు ఉన్నందున అడవి తల్లి బాట పనుల విషయంలో అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆయన సూచించారు. స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారి రోడ్డు సౌకర్యం పొందే ఆవాసాలు కూడా ఈ పథకంలో ఉన్నాయని గుర్తుచేశారు. కాబట్టి గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన పనుల గురించి స్థానికులకు కూడా తెలియజేయడం ఎంతో అవసరని అభిప్రాయపడ్డారు. డోలీరహిత ఆవాసాలు ఉండాలనే సంకల్పంతో చేపట్టిన విషయాన్ని చెప్పాలని పేర్కొన్నారు. తద్వారా వారి సహకారం, ప్రోత్సాహం కూడా లభిస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
జనసేన కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు
గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు హాజరయ్యారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుమారుడు ప్రసన్న కుమార్‌కు, మంగళగిరి మండలం నూతక్కి గ్రామానికి చెందిన మాధవరెడ్డి కుమార్తె వెన్నెలతో వివాహమైంది. ఈ వేడుకకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, పలువురు ఎమ్మెల్యేలు అతిథులుగా హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలీప్యాడ్ వద్ద దిగారు. వారికి జనసేనపార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. వివాహావేడుకకు హాజరై తిరిగి వెళ్లడానికి హెలిప్యాడ్ వద్దకు వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పంపించిన కొండపల్లి బొమ్మలను జనసేన పార్టీ నేతలు అందజేశారు.
Also Read : YSRCP Leaders: పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అరాచకాలపై చర్యలు తీసుకోవాలి – వైసీపీ
