Deputy CM Pawan Kalyan: నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివి – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివి - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

 

నిస్వార్దంగా నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. సోమవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విధినిర్వహణలో విశేషమైన సేవలు అందిస్తున్న పలువురు నర్సులను ఆయన ఘనంగా సత్కరించారు. విధి నిర్వహణలో ఎంతోమంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరూ మరిచిపోరని ఆయన ప్రశంసించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… వైద్యరంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యమని కొనియాడారు. ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ స్ఫూర్తితో… రోగులకు స్వస్థత కలిగేలా వృత్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. నిస్వార్థంగా వారు అందించే సేవలు వెలకట్టలేనివన్నారు. నర్సుల చేతి స్పర్శ కూడా రోగిలో మానసిక స్థైర్యంతో పాటు సాంత్వన కలిగిస్తుందని తెలిపారు. “విధి నిర్వహణలో ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరూ మరచిపోరు. మీరు పడే శ్రమ, కష్టం నాకు తెలుసు. కొవిడ్ సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తించిన విధానం మరువలేం. ఇటీవల సింగపూర్‌ నా కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదానికి గురై ఆసుపత్రిలో ఉన్న సమయంలో అక్కడ నర్సులు చేసిన సేవలు చూసినప్పుడు మరోసారి మీ కష్టం గుర్తుకువచ్చింది. మిమ్మల్ని కలసి మీరు అందించే సేవలు మరచిపోలేనివి అని చెప్పి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాను. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలిసే అవకాశం రావడం ఆనందాన్నిచ్చింది. నా దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్తాం” అని తెలిపారు.

 

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నర్సుల వృత్తికి గౌరవాన్ని, ఖ్యాతిని తెచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని పురస్కరించుకొని అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆరోగ్య సంరక్షణలో నర్సుల కృషి, సేవ అమోఘమని కొనియాడారు. పేషంట్లను సొంత మనిషిలా చూసుకుంటూ.. అవసరమైన చికిత్సలో ఆసరాగా నిలుస్తున్న నర్సులు.. చిరునవ్వుతో, మానవత్వంతో సేవలందించే ప్రతి నర్సుకీ హృదయపూర్వక వందనాలు అని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.

 

కాగా ఆపరేషన్‌ సిందూర్‌లో అవసరమైతే తమ వంతు పాత్ర పోషిస్తామని తెలంగాణ ప్రభుత్వ నర్సింగ్‌ ఆఫీసర్లు స్పష్టం చేశారు. పాకిస్థాన్‌కు దీటుగా బదులిస్తున్న మన సైన్యానికి వైద్య సేవలందించేందుకు సిద్ధమని పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నర్సింగ్‌ ఆఫీసర్లు ప్రతిజ్ఞ చేశారు. శనివారం సాయంత్రం కోఠీలోని వైద్య విద్య సంచాలకుల కార్యాలయంలో సోమవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నర్సులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితుల్లోనైనా సేవలందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కాగా, అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రవీంద్రభారతిలో తెలంగాణ (ప్రభుత్వ) నర్సెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్‌ నర్సెస్‌ డే వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో వైద్య మంత్రితో పాటు, ఆరోగ్య శాఖ కార్యదర్శి, డీఎంఈ, డీహెచ్‌, టీవీవీపీ కమిషనర్‌, టీఎన్‌జీవో ప్రెసిడెంట్‌, జనరల్‌ సెక్రటరీ పాల్గొంటారని అసోసియేషన్‌ అధ్యక్షురాలు ఆది లక్ష్మి తెలిపారు.

 

 

Leave A Reply

Your Email Id will not be published!