Simhachalam Giri Pradarsana: కన్నుల పండుగగా సింహాచలం గిరిప్రదక్షిణ !
కన్నుల పండుగగా సింహాచలం గిరిప్రదక్షిణ !
Simhachalam Giri Pradarsana: సింహాచలం క్షేత్రంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన గిరి ప్రదక్షిణ మహోత్సవం ఆదివారం ఉదయం పరిపూర్ణమైంది. శనివారం ప్రదక్షిణ ప్రారంభించిన భక్తులు 32 కిలోమీటర్లు సింహాచలం(Simhachalam) కొండను పాదయాత్రగా చుట్టి వచ్చారు. వారంతా ఆదివారం ఉదయానికి అప్పన్న ఆలయానికి చేరుకున్నారు. సింహాద్రి నాథుడిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. ఆషాఢ శుద్ద చతుర్దసినాడు గిరి ప్రదర్శనను ప్రారంభించి పౌర్ణమినాడు స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ క్రమంలోనే గిరి ప్రదర్శన చేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. 32 కిలోమీటర్ల మేర కాలినడకన చేసే గిరి ప్రదక్షిణలో లక్షలాదిమంది భక్తులు పాల్గొన్నారు. గత ఐదేళ్ళతో పోలిస్తే ఈ ఏడాది భక్తులు పెద్ధ ఎత్తున తరలివచ్చారు. జోరు వానను సైతం లెక్కచేయకుండా గిరి ప్రదక్షిణ(Simhachalam Giri Pradarsana) పూర్తి చేసి… 12 మణుగులు చందనం మధ్య శోభాయమానంగా ఉన్న సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు.
Simhachalam Giri Pradarsana Updates
గిరి ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం వస్తుందని భక్తుల నమ్మకం. దీనికి తోడు వనమూలికలతో కూడిన కొండ చుట్టూ 32 కి.మీ. ప్రదక్షిణ చేస్తే ఆయురారోగ్యాలు ఉంటాయని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలోనే ప్రతీ ఏటా ఆషాఢ శుద్ద చతుర్దసినాడు సింహాచలం తొలి పావంచవద్ద కొబ్బరికాయ కొట్టి 32 కి.మీ. కాలినడకన గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుంటారు. దీనితో ఈ ఏడాది గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు.
సింహాద్రి స్వామికి చివర విడత చందనం సమర్పణ !
సింహాద్రి అప్పన స్వామికి చివర విడత చందనం సమర్పణ జరిగింది. అర్చకులు వేకువజామున స్వామికి విశేష పూజలు, ఆరాధనలు నిర్వహించారు. వరాహ లక్ష్మి నరసింహ స్వామి సుప్రభాతం అనంతరం మూడు మనుగుల శ్రీ గంధాన్ని అర్చక స్వాములు సమర్పించారు. సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి ముందుగా సిద్ధం చేసిన మూడు మణుగుల (సుమారు 125 కిలోలు) శ్రీ గంధాన్ని సింహగిరి నరహరికి సమర్పించారు. 12 మనుగుల శ్రీగంధంలో అప్పన్న స్వామి భక్తులకు దర్శన భాగ్యం కలిగింది. కాగా 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ముగించుకుని భక్తులు సింహగిరి చేరుకుంటున్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం సింహగిరి చేరుకుంటున్న భక్తులతో కిటికీటలాడుతోంది. గిరి ప్రదక్షిణ చేయలేని భక్తులు… 32 సార్లు గుడి ప్రదక్షిణ చేస్తున్నారు. గుడి ప్రదక్షణ చేస్తున్న భక్తుల కోసం సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా రెండు ర్యాంప్‌లను దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు.
Also Read : AP CM : ఏపీ ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు