Air India: ఎయిరిండియాకు రూ.30 లక్షలు జరిమానా విధించిన డీజీసీఏ ?
ఎయిరిండియాకు రూ.30 లక్షలు జరిమానా విధించిన డీజీసీఏ ?
Air India: వీల్ ఛైర్ అందుబాటులో లేకపోవడంతో ముంబై ఎయిర్ పోర్టులో 80 ఏళ్ళ వృద్ధుడు మృతి చెందిన ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సీరియస్ అయ్యింది. వీల్ చైర్ అందుబాటులో ఉంచకుండా ఓ ప్రయాణికుడు మృతికి కారణమైన ఎయిర్ ఇండియా(Air India) విమానయాన సంస్థకు రూ.30 లక్షల జరిమానా విధించింది. జాతీయ మానవ హక్కుల కమీషన్ నోటీసుల మేరకు విచారణ చేపట్టిన డీజీసీఏ… విమానయాన సంస్థ నిర్లక్ష్యం వలనే ప్రయాణికుడు చనిపోయినట్లు నిర్ధారించింది. ఈ మేరకు ఆ సంస్థకు డీజీసీఏ జరిమానా విధించింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Air India Got Penalty
అమెరికాలోని భారత సంతతికి చెందిన వృద్ధుడు ఫిబ్రవరి 12 తన భార్యతో కలిసి ఎయిరిండియా విమానంలో న్యూయార్క్ నుంచి ముంబయి చేరుకున్నారు. టికెట్ కొనుగోలు సమయంలోనే వీరిద్దరూ వీల్ ఛైర్ ప్రయాణికులుగా బుక్ చేసుకున్నారు. అయితే ఎయిర్‌పోర్టులో సరిపడా వీల్ చైర్లు అందుబాటులో లేకపోవడంతో… సిబ్బంది వీరికి ఒక్క వీల్ చైర్ ఇచ్చారు. దీనితో వీల్ ఛైర్ లో తన భార్యను కూర్చోబెట్టిన ఆ వృద్ధుడు… ఆమె వెంట నడుచుకుంటూ వెళ్లాడు. విమానం దిగిన ప్రాంతం నుంచి దాదాపు 1.5 కిలోమీటర్లు నడిచిన అతడు ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్దకు రాగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఎయిర్‌పోర్టు సిబ్బంది వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనితో ముంబై ఎయిర్ పోర్ట్ లో ఇలాంటి ఘటన జరగడం సంచలనంగా మారింది. దీనిపై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమీషన్…. డీజీసీఏకు నోటీసులు జారీ చేసింది. జాతీయ మానవ హక్కుల కమీషన్ నోటీసుల మేరకు విచారణ చేపట్టిన డీజీసీఏ… ప్రయాణికుడు మృతికి విమానయాన సంస్థ ఎయిరిండియా నిర్లక్ష్యంగా నిర్ధారించి… రూ. 30 లక్షలు జరిమానా విధించింది.
Also Read : DSC 2024 Notification: తెలంగాణలో 11,062 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల !