Dhananjay Munde: సర్పంచ్ హత్యకేసులో మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ రాజీనామా !
సర్పంచ్ హత్యకేసులో మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ రాజీనామా !
Dhananjay Munde : మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో సర్పంచ్ దారుణ హత్య వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే(Dhananjay Munde) తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్య కేసులో ఆయనపై ఆరోపణలు రావడంతో మంత్రి పదవికి రాజీనామా చేయాలని ధనంజయ్ ముండేను సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశించినట్లు సమాచారం. దీనితో ఆయన తన రాజీనామాను సమర్పించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ ముండే రాజీనామాను తాను ఆమోదించి… గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు పంపానని మీడియాకు తెలిపారు.
Minister Dhananjay Munde Resign
ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంలో కీలకనేత అయిన ధనంజయ్ ముండే సొంత జిల్లా బీడ్‌లో మసాజోగ్ గ్రామ సర్పంచి సంతోష్ దేశ్‌ముఖ్‌ను కిడ్నాప్ చేసి ఆ తర్వాత చిత్రహింసలకు గురిచేసి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హత్యోదంతానికి సంబంధించిన కేసులో మంత్రి సన్నిహితుడు వాల్మిక్ కరాడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీనితో ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
మరోవైపు… మంత్రి ధనంజయ్ ముండే(Dhananjay Munde)కు గట్టి మద్దతు ఇస్తున్న ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు, మంత్రికి వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను తాను సమర్పించినట్లు సామాజిక కార్యకర్త అంజలి దమానియా పేర్కొనడంతో మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్లు మళ్లీ మొదలయ్యాయి. ఎన్సీపీ (శరద్ పవార్) కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుప్రియా సూలే సైతం ధనంజయ్ ముండే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల ధనంజయ్ మాట్లాడుతూ… తనను మంత్రి పదవికి రాజీనామా చేయాలని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లేదా డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చెప్తే వెంటనే రాజీనామా చేస్తానన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసు నుండి నిర్థోషిగా బయటపడిన తరువాత మళ్ళీ మంత్రి పదవి చేపట్టే అవకాశం ఉంది.
Also Read : Pawan Kalyan: సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ ! ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చ ?