DK Shivakumar: కన్నడ రాజకీయాల్లో ఆశక్తి రేపుతోన్న ఖర్గే, డీకేల భేటీ

కన్నడ రాజకీయాల్లో ఆశక్తి రేపుతోన్న ఖర్గే, డీకేల భేటీ

DK Shivakumar : కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కలుసుకోవడం కన్నడ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. డీకే శివకుమార్‌(DK Shivakumar) ప్రజల హృదయాలను గెలుచుకున్నారని, ఆయనను సీఎం కాకుండా ఎవరూ ఆపలేరని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీరప్పమొయిలీ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే ఖర్గేతో శివకుమార్ భేటీ కావడం కన్నడ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఖర్గేతో భేటీలో రాష్ట్ర మంత్రులు చేస్తున్న బహిరంగ- వివాదాస్పద ప్రకటనలు, వాటి ప్రభావాలను డీకే ప్రస్తావించారని సమాచారం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక అంశం ప్రస్తావనకు వచ్చింది. సీనియర్‌ మంత్రులు కె.ఎన్‌.రాజణ్ణ, సతీశ్‌ జార్ఖిహొళ్లి, డాక్టర్‌ పరమేశ్వర్‌ తదితరుల ప్రకటనలను పరిశీలించి, వారిని అదుపు చేయాలని డీకే కోరినట్లు తెలుస్తోంది.

DK Shivakumar Meet

అయితే ఈ భేటీపై డీకే మాత్రం ఆచితూచి స్పందించారు. ‘ఖర్గేతో(Mallikarjun Kharge) నా సమావేశం పూర్తిగా ప్రొటోకాల్‌కు సంబంధించిన అంశం’ అని తెలిపారు. ‘ఆయన మా పార్టీ అధ్యక్షుడు. బెంగళూరులో పార్టీ కొత్త కార్యాలయం శంకుస్థాపన కోసం ఆయనను ఆహ్వానించాం. ఈ సందర్భంగా ఆయనతో ఎన్నో విషయాలపై చర్చించా’ అని వెల్లడించారు.

డీకే శివకుమార్‌ ప్రజల హృదయాలను గెలుచుకున్నారని, ఆయనను సీఎం కాకుండా ఎవరూ ఆపలేరని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్పమొయిలీ గత ఆదివారం వ్యాఖ్యానించారు. ఇప్పటికే సమర్ధుడైన నాయకుడిగా డీకే తనను తాను నిరూపించుకున్నారని, ఆయన ముఖ్యమంత్రి కావడం కాలపరిమితికి సంబంధించిన అంశమని, ఇవాళో, రేపే అది కూడాజరగవచ్చని వ్యాఖ్యానించారు. మెయిలీ వ్యాఖ్యలపై డీకే మాత్రం ఆచితూచి స్పందించారు. వీరప్ప మొయిలీ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పారని, దాని గురించి తాను మాట్లాడేదేమీ లేదని అన్నారు. ఖర్గే ఆదేశాలకు తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఇటీవలే కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజ్ శివగంగసైతం డీకేకు సీఎంగా పదోన్నతి తథ్యమని, డిసెంబర్‌లో అది జరగవచ్చని జోస్యం చెప్పారు.

Also Read : Former CM Prafulla Kumar: డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన అస్సాం మాజీ సీఎం కుమార్తె

Leave A Reply

Your Email Id will not be published!