Donald Trump: ట్రంప్ సొంత నిధులతో సునీతా విలియమ్స్ ఓవర్ టైమ్ జీతం
ట్రంప్ సొంత నిధులతో సునీతా విలియమ్స్ ఓవర్ టైమ్ జీతం
Donald Trump : 8 రోజుల పర్యటన నిమిత్తం అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి అనుకోని పరిస్థితుల్లో సుమారు 9 నెలల పాటు చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు ఇటీవల సురక్షితంగా భూమిని చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరు సుదీర్ఘకాలం అంతరిక్షంలోనే ఉండిపోయినందుకు ఫెడరల్ ఉద్యోగుల జీత భత్యాల నిబంధనల ప్రకారం వీరికి ఎలాంటి అదనపు వేతనాలు ఉండవు. దీనితో తొమ్మిది నెలల పాటు కుటుంబానికి దూరంగా, ప్రాణాలకు తెగించి అంతరిక్షంలో గడిపిన వ్యోమగాములకు నామ మాత్రపు ఓవర్ టైం జీతం వస్తుందని ఫెడరల్ వర్గాల సమాచారం. దీనితో సునీతా విలియమ్స్ తో పాటు ఇతర వ్యోమగాముల ఓవర్ టైం జీతం పై… తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) స్పందిస్తూ కీలక ప్రకటన చేశారు. వారి ఓవర్ టైమ్ జీతాన్ని తాను సొంతంగా చెల్లిస్తానని ప్రకటించారు.
Donald Trump Gives
సునీత(Sunitha Williams), విల్మోర్‌కు ఎలాంటి అదనపు వేతనం ఉండదా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ.. ‘‘నేను చేయాల్సివస్తే… నా జేబు నుంచి వారికి ఓవర్‌టైమ్ జీతం చెల్లిస్తా. ఈసందర్భంగా వ్యోమగాములను సురక్షితంగా భూమ్మీదకు తీసుకొచ్చేందుకు సాయం చేసిన ఎలాన్ మస్క్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆయన లేకపోతే ఏమై ఉండేదో ఓసారి ఆలోచించండి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అంతరిక్షంలో నిర్దేశిత సమయం కన్నా ఎక్కువకాలం పనిచేసిన వ్యోమగాములకు అదనంగా ఎలాంటి చెల్లింపులు ఉండవని తెలిసింది. ఫెడరల్ ఉద్యోగులు అయినందువల్ల… అంతరిక్షంలో వారు పనిచేసిన కాలాన్ని భూమ్మీద సాధారణ పర్యటన చేసినట్లుగానే పరిగణిస్తారని నాసా నిపుణులు వెల్లడించారు. సాధారణంగా వచ్చే జీతంతోపాటు ఐఎస్‌ఎస్‌లో ఆహారం, బస ఖర్చులను నాసా భరిస్తుందన్నారు. ఇటువంటి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నప్పుడు మాత్రం అదనంగా రోజుకు 5 డాలర్ల చొప్పున చెల్లిస్తుందట. అంటే… సునీత, విల్మోర్ 286 రోజులు అంతరిక్షంలో ఉన్నందుకుగానూ… అదనంగా వారికి 1,430 డాలర్ల చొప్పున చెల్లించనున్నారు.
నాసా ఉద్యోగులు… అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు పొందే జీతభత్యాలే పొందుతారు. వ్యోమగాములకు జనరల్ షెడ్యూల్ జీఎస్-13 నుంచి జీఎస్-15 కింద చెల్లింపులు ఉంటాయి. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు అత్యధిక గ్రేడ్ జీఎస్-15 గ్రేడ్ పే జీతం అందుకుంటున్నారు. దీని ప్రకారం.. గతేడాది వీరి వార్షిక వేతనం 1,52,000 డాలర్లుగా ఉంది.
Also Read : Amit Shah: ఆర్టికల్ 370 రద్దుతోనే కశ్మీర్ లో శాంతి – హోం మంత్రి అమిత్ షా