Drone Attack: మాస్కోలో డ్రోన్ దాడి ! భారత ఎంపీలకు తృటిలో తప్పిన ప్రమాదం !

మాస్కోలో డ్రోన్ దాడి ! భారత ఎంపీలకు తృటిలో తప్పిన ప్రమాదం !

Drone Attack : పహాల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్… ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాదుల స్థావరాలను భారత భద్రతాబలగాలు నేలమట్టం చేసాయి. దీనితో పాకిస్తాన్ విచక్షిణా రహితంగా దాడులు చేసినప్పటికీ… వాటిని భద్రతా బలగాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయి. మరోవైపు ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్(Pakistan) నిజస్వరూపం బయటపెట్టడానికి… భారత్ దౌత్య యుద్ధం కూడా మొదలుపెట్టింది.

Drone Attack on Indian MP’s

ఈ దౌత్య యుద్ధంతో అంతర్జాతీయంగా పాక్‌ను ఏకాకిని చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా శత్రుదేశ దుశ్చర్యలను ఎండగట్టేందుకు మన దేశ విధానాన్ని వివరించేందుకు ఎంపీల బృందాలను విదేశాలకు పంపుతోంది. అయితే ఈ క్రమంలో రష్యా వెళ్లిన మన ఎంపీల బృందానికి అనుకోని చిక్కు వచ్చిపడింది. సరిగ్గా భారత ఎంపీల విమానం అక్కడ ల్యాండ్ అయ్యే సమయంలో రష్యా మీద ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

పహల్గాం ఉగ్ర దాడి, పాకిస్థాన్‌ సీమాంతర ఉగ్రవాదంపై వివరించేందుకు డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలోని భారత ప్రతినిధుల బృందం రష్యాకు చేరుకుంది. అయితే, మాస్కోలో వీరికి అనూహ్య అనుభవం ఎదురైంది. డ్రోన్‌ దాడుల కారణంగా ఎయిర్‌పోర్టు మూసివేయడంతో వీరు ప్రయాణిస్తున్న విమానం కొన్ని గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. రష్యా మీద ఉక్రెయిన్ డ్రోన్ అటాక్(Drone Attack) కారణంగా భారత ప్రతినిధి బృందం ప్రయాణిస్తున్న విమానం ల్యాండ్ అవ్వలేదు. రష్యా రాజధాని మాస్కో మీదుగా ఆ ఫ్లైట్ చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. డ్రోన్ దాడుల కారణంగా మాస్కోలోని అన్ని ఎయిర్‌పోర్ట్‌ లలో విమానాల కదలికలు నిలిచిపోయాయి. దీనితో భారత ఎంపీల విమానం చాలా సేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఆఖరుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో మాస్కోలో ఆ విమానం ల్యాండ్ అయింది. దీనితో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అఖిలపక్ష బృందాన్ని మాస్కోలోని భారత రాయబారి వినయ్ కుమార్ ఘనంగా స్వాగతించారు. అనంతరం అత్యంత భద్రత నడుమ వారిని హోటల్‌కు తీసుకెళ్లారు. ఈ బృందంలో ఎస్పీ ఎంపీ రాజీవ్‌రాయ్‌, నేషనల్ కాన్ఫరెన్స్‌ ఎంపీ మియాన్‌ అల్తాఫ్‌ అహ్మద్‌, భాజపా ఎంపీ కెప్టెన్‌ బ్రిజేష్‌ చౌత, ఆప్‌ ఎంపీ అశోక్‌ కుమార్‌ మిత్తల్‌, రాయబారులు మంజీవ్ ఎస్‌.పురి, జావెద్‌ అష్రాఫ్‌ ఉన్నారు. వీరు రష్యా విదేశాంగ శాఖ ఉప ప్రధానితో పాటు పలువురు ఉన్నతాధికారులతోను సమావేశం కానున్నారు.

కాగా, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం గురించి రష్యా సర్కారుతో పాటు అక్కడి ఎంపీలు, అధికారులు, నిపుణులకు సమాచారం అందించనున్నారు భారత ఎంపీలు. రష్యాతో ఇండియాకు ఇప్పటికే బలమైన సంబంధాలు ఉన్నాయని ఎంపీ కనిమొళి అన్నారు. పాక్ టెర్రరిస్టులు మొత్తం ప్రపంచానికి ముప్పుగా మారారని, ఇదే విషయాన్ని తాము రష్యాకు వివరంగా చెబుతామన్నారు. కొన్ని మేధో సంస్థలు, రష్యా మీడియాతోనూ కనిమొళి బృందం మాట్లాడనుంది. పాక్‌ తీరు, ఉగ్రవాదంపై భారత్‌ పోరును వారికి వివరించనుంది. ఇక, రష్యా పర్యటన తర్వాత స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాత్వియా దేశాల్లోనూ ఈ బృందం పర్యటించనుంది.

Also Read : Encounter: గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్‌ ! నలుగురు మావోయిస్టులు మృతి !

Leave A Reply

Your Email Id will not be published!