ప్రకాశం జిల్లా దర్శి, పొదిలి, కురిచేడు, ముండ్లమూరులో భూ ప్రంపనలు చోటు చేసుకున్నాయి. మంగళవారం ఉదయం 5సెకన్ల పాటు భూమి కంపించింది. భూమి కంపించడంతో భయంతో ఇండ్లలో నుంచి జనం బయటకు పరుగులు తీశారు. గత ఏడాది సైతం ప్రకాశం జిల్లాలోని దర్శి, ముండ్లమూరు, తాళ్లూరులో భూమి కంపించింది. కాగా, సోమవారం సాయంత్రం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3.8 తీవ్రతతో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. అటు నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, కడెం, జన్నారం, లక్సెట్టిపేటలో భూమి కంపించింది.
దర్శి నియోజకవర్గంలో గత ఏడాది డిసెంబర్ లో వరుసగా నాలుగు రోజుల పాటు భూమి కంపించింది. గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతంలో భూగర్భంలో మార్పులు కారణంగా భూమి కంపిస్తున్నట్లుగా ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో గతంలోనూ భూ ప్రకంపనలు నమోదవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భూకంప తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఇంకా ఎలాంటి మార్పులు వస్తాయోనని ప్రజలు టెన్షన్ పడుతున్నారు. భూకంపాలపై గతంలోనూ ఈ ప్రాంతాల్లో అధికారులు పరిశోధనలు చేశారు. భూగర్భంలో చిన్న చిన్న కదలికలు వచ్చినప్పుడు ఇలాంటి భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇవి భారీ భూకంపాలకు సంకేతాలుగా మారుతాయా లేదా సాధారణంగా వచ్చే ప్రకంపనలేనా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ప్రజల భద్రతలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రజలు భయపడవద్దని, ఎలాంటి అపోహాలకు లోను కావద్దని అధికారులు చెబుతున్నారు. భూప్రకంపనలపై ప్రభుత్వం అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. భూకంపాల వేగం, తీవ్రత వంటి అంశాలపై నిరంతరం పర్యవేక్షణ జరగాలని ప్రజలు అంటున్నారు.