తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికలు రానున్నాయి. సీఎం కేసీఆర్ ఇప్పటికే అడుగులు వేస్తున్నాడు. ఆయన ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేయడంలో ఫోకస్ పెట్టాడు. ఇక పవర్ లోకి రావాలని పరితపిస్తున్న కాంగ్రెస్, బీజేపీలు నువ్వా నేనా అన్నట్టుగా యుద్దంలోకి దిగాయి. బీఆర్ఎస్ లో కీలకమైన అగ్ర నాయకుడిగా, మాజీ మంత్రిగా పేరు పొందిన ఈటల రాజేందర్ ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో కమల తీర్థం పుచ్చుకున్నారు.
ఆయనకు ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి కీలక నేతలను తీసుకు వచ్చే బాధ్యతను అప్పగించారు. దీంతో దీనిపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు ఈటల రాజేందర్. తాజాగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఇటీవలే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు భారత రాష్ట్ర సమితి నుండి బహిష్కరించారు. దీంతో అటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటు భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.
తాజాగా ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తదితరులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సుదీర్ఘ చర్చలు జరిపారు. తమ పార్టీలోకి రావాలని కోరారు. మరో వైపు మాజీ మంత్రి, మాజీ ఎంపీ ఎటు వైపు వెళతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.