సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్ : చంద్ర‌బాబు

ఎస్ హెచ్ జీ మహిళల సీవీడ్ ఫార్మింగ్ పై సమీక్ష

అమరావతి : రాష్ట్రంలోని సముద్ర నాచు ఉత్పత్తులు, విలువ జోడింపు తదితర అంశాల్లో మహిళలు ఆదాయాన్ని ఆర్జించేందుకు వీలుగా ఓ ఎకనామిక్ మోడల్ ను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సముద్ర తీర ప్రాంతాల్లో సీవీడ్ ఫార్మింగ్ తో స్వయం సహాయ సంఘాల మహిళలు, మత్య్సకారులకు అదనపు ఆదాయాల కల్పనపై సీఎం సమీక్ష నిర్వహించారు. సీవీడ్ కల్టివేషన్ ద్వారా ఎస్ హెచ్ జీ మహిళల ఆదాయ మార్గాలు పెరిగేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచనలు చేశారు. ఏపీలోని సముద్ర తీరప్రాంతాల్లో సీవీడ్ కల్టివేషన్ కు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సెంట్రల్ సాల్ట్ మెరైన్ రీసెర్చి ఇనిస్టిట్యూట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ తదితర సంస్థల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వర్చువల్ గా మాట్లాడారు.

అమృతా విశ్వ విద్యాపీఠంతో కలిసి మహిళలకు సీవీడ్ కల్చర్ సాగుకు సంబంధించిన అంశాలపై ఓ నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. సీవీడ్ ద్వారా వచ్చే ఆదాయంపై ఓ ఎకనామిక్ మోడల్ ను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సుదీర్ఘమైన తీరప్రాంతంలో సముద్ర నాచు సాగు ద్వారా మహిళలకు ఉపాధి కల్పించేలా వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి వచ్చేలా ప్రణాళికలు చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సీవీడ్ ద్వారా వివిధ ఉత్పత్తులు తయారు చేసేందుకు విలువ జోడించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి కోసం జాతీయ, అంతర్జాతీయ సంస్థలను కూడా సంప్రదించాలన్నారు. మెరైన్ ఉత్పత్తిగా సంపద సృష్టికి సీవీడ్ ఓ కీలకమైన ప్రత్యామ్నాయం అవుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఫార్మా సహా, న్యూట్రాసిటికల్ ఉత్పత్తుల్లో ప్రధానమైన ముడిసరుకు గా ఈ సీవీడ్ అంతర్జాతీయ మార్కెట్ ను అందుకోవాలని సీఎం ఆకాంక్షించారు.

Leave A Reply

Your Email Id will not be published!