బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనిపించు కోవడమే నా లక్ష్యం
ఎం4ఎం మూవీ హీరోయిన్ జో శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్ : ఇండియన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన మూవీ ఎం4ఎం (మోటివ్ ఫర్ మర్డర్). అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఎం4ఎం మే 8న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ మూఈలో ప్రధాన పాత్రలో నటించిన అమెరికన్ నటి జో శర్మ మీడియాతో మాట్లాడారు. తాను శాన్ ఫ్రాన్సిస్కో (అమెరికా) నుంచి వచ్చానని, ఈ మూవీ తనకు ప్రత్యేకమని అన్నారు. పలు భాషలలో విడుదల అవుతుందన్నారు. ఈ చిత్రంలో తన పాత్ర పేరు రాధ. ఇందులో తాను క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా కనిపిస్తానని చెప్పారు.
తాను అమెరికాలో థియేటర్ ఆర్టిస్ట్నని, నాకంటూ ఒక థియేటర్ ప్రొడక్షన్ కంపెనీ కూడా ఉందన్నారు. మోహన్ దగ్గర మూడేళ్లు శిక్షణ తీసుకున్నానని తెలిపింది జోశర్మ. కథా చర్చల్లో పాల్గొనడం వల్ల నా పాత్రను చాలా బలంగా డిజైన్ చేసుకున్నానని పేర్కొంది. సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మాకు 15 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు రావడం ఆనందంగా ఉందన్నారు. లాస్ ఏంజెల్స్ ఫిలిం ఫెస్టివల్ నుంచి బెస్ట్ ఫిలిం, లండన్ ఫిలిం ఫెస్టివల్ నుంచి బెస్ట్ డైరెక్టర్, న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ నుంచి బెస్ట్ యాక్ట్రెస్, హాలీవుడ్, శాంటా మోనికా తదితర ఫిలిం ఫెస్టివల్స్‌లో ఉత్తమ నటిగా నాకు, ఉత్తమ దర్శకుడిగా మోహన్ కి అవార్డులు వచ్చాయని వెల్లడించింది జో శర్మ. ముఖ్యంగా ప్రతిష్టాత్మక ‘కేన్స్’ (Cannes) ఫిల్మ్ ఫెస్టివల్లో మా సినిమా గ్లోబల్ ప్రీమియర్ వేశారు. అక్కడ తెలుగు సినిమాను సబ్-టైటిల్స్‌తో చూసిన విదేశీయులు కూడా ఆశ్చర్యపోయి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. అది మాకు దక్కిన చాలా గొప్ప గౌరవం. అక్కడ మా సినిమాకు వచ్చిన స్పందన ఎంతో ఆత్మవిశ్వాసం కలిగించేలా చేసిందన్నారు.