అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఆదేశాలతో రెండు కుంకీ ఏనుగులను పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకి తరలించేందుకు అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ముసలమడుగు క్యాంపు నుంచి వీటిని పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపునకు తరలించనున్నారు. పవన్ కళ్యాణ్ చొరవతో అడవి ఏనుగుల బెడదతో దీర్ఘకాలంగా పడుతున్న ఇబ్బందుల నుంచి పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు ఉపశమనం కలగనుంది. ఉప ముఖ్యమంత్రి సూచనతో రాష్ట్రంలోని నానియాల్ ఏనుగుల శిబిరంలో ప్రత్యేక శిక్షణ పొందిన జయంత్ అనే కుంకీతో పాటు కర్ణాటక నుంచి తీసుకు వచ్చిన అభిమన్యుని పార్వతీపురం మన్యం జిల్లాకి తరలించేందుకు అటవీ అధికారులు సిద్ధం చేశారు. ఈ రెండూ మానవ–ఏనుగు సంఘర్షణ నియంత్రణ కార్యక్రమాల్లో అత్యంత అనుభవం కలిగినవిగా గుర్తింపు పొందాయి.
ఇటీవల కాలంలో అభిమన్యు, జయంత్ లు ఆరు మేజర్ ఆపరేషన్లలో భాగస్వామ్యమై విజయవంతంగా పూర్తి చేశాయి. ఇటీవల పలమనేరు సమీపంలో ఒంటరి మగ అడవి ఏనుగుని బంధించిన ఆపరేషన్ లో ఈ రెండు కుంకీలు అత్యంత కీలకంగా వ్యవహరించాయి. రెండింటి మధ్య సమన్వయం, ఆపరేషన్లలో పనితీరు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సరిహద్దులకు ఒడిశా రాష్ట్రం నుంచి అడవి ఏనుగుల గుంపులు పదే పదే తరలి వస్తున్నాయి. వ్యవసాయ భూముల్లో చొరబడి పంటలను నాశనం చేయడంతో పాటు గ్రామాల మీద పడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. అడవుల విభజన, అటవీ ఆవరణ తగ్గడం, ఆహారం, నీటి కొరత తదితర సమస్యల కారణంగా తరచూ అడవి ఏనుగులు ఒడిశా సరిహద్దుల నుంచి మన్యం జిల్లాకి చెందిన గ్రామాల్లో చొరబడుతున్నాయి.
మన్యం జిల్లాలో ఏనుగుల బెడద నివారణకు ఒడిశా ప్రభుత్వంతో చర్చించి, తిరిగి మళ్లింపు చర్యలు చేపట్టడంతోపాటు ఆ రాష్ట్రం నుంచి కుంకీ ఏనుగులను కూడా తీసుకు రావాలని ఉప ముఖ్యమంత్రి నిర్ణయించారు. అంతకంటే ముందు తక్షణ ఉపశమన చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అందుబాటులో ఉన్న రెండు కుంకీలను పలమనేరు నుంచి గుచ్చిమి క్యాంపునకు తరలించాలని ఆదేశించారు. గుచ్చిమి క్యాంపు నుంచి ఈ రెండు ఏనుగుల సహాయంతో సమస్యాత్మక ప్రాంతాల్లో సంఘర్షణల నియంత్రణ చర్యలు చేపడతారు. వీటితోపాటు సౌర కంచెల నిర్మాణం, ఏనుగులను నిరోధించేందుకు వీలుగా కందకాలు తవ్వడం, నీటి వనరుల అభివృద్ధి, ఏఐ ఆధారిత పర్యవేక్షణ, డ్రోన్ నిఘా, హనుమాన్ ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను అందుబాటులో ఉంచి, సమస్య తీవ్రత ఉన్న గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లాంటి చర్యలు తీసుకోనున్నారు.
