HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై ఈడీ చర్యలు ! ఐదుగురిపై మనీ లాండరింగ్ కేసు !

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై ఈడీ చర్యలు ! ఐదుగురిపై మనీ లాండరింగ్ కేసు !

 

 

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో జరిగిన ఆర్థిక అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఐదుగురిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) నమోదు చేసింది. ఈ కేసులో HCA అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు, కోశాధికారి శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కాంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, అధ్యక్షురాలు కవిత యాదవ్‌లపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) సెక్షన్ల కింద నమోదైంది.

 

గతంలో HCAకు సంబంధించి నమోదైన రెండు కేసులను కలిపి ఈడీ కొత్త ECIRను రిజిస్టర్ చేసింది. బీసీసీఐ నుంచి HCAకు వచ్చిన నిధులలో భారీగా మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నిధుల దుర్వినియోగం, అక్రమ లావాదేవీలపై లోతైన దర్యాప్తు చేపట్టేందుకు ఈడీ సిద్ధమైంది. ఈ కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు ఈడీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఈ ఐదుగురు నిందితులు తెలంగాణ సీఐడీ కస్టడీలో ఉన్నారు. సీఐడీ విచారణ పూర్తయిన వెంటనే ఈడీ వారిని తమ కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా దర్యాప్తు చేయనుంది.

 

HCAలో జరిగిన ఆర్థిక అక్రమాలు, నకిలీ పత్రాల సృష్టి, ఐపీఎల్ టికెట్ల అక్రమ విక్రయాలు, ఆటగాళ్ల ఎంపికలో అవకతవకలు వంటి ఆరోపణలు ఈ కేసును మరింత సంక్లిష్టంగా మార్చాయి. జగన్‌మోహన్ రావు HCA అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి నకిలీ పత్రాలను ఉపయోగించారని, శ్రీచక్ర క్రికెట్ క్లబ్‌ను అక్రమంగా ఏర్పాటు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సీఐడీకి ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా ఈడీ ఈ కేసులో జోక్యం చేసుకుంది.

 

సీఐడీ ఇప్పటికే నిందితులను ఆరు రోజుల కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతోంది. ఈ విచారణలో రూ.170 కోట్ల ఆర్థిక కుంభకోణం, ఐపీఎల్ 2025 సీజన్‌లో టికెట్ బ్లాక్‌మెయిల్, BCCI నిధుల దుర్వినియోగం వంటి కీలక విషయాలు బయటపడ్డాయి. ఈడీ ఈ విషయాలను మరింత లోతుగా పరిశీలించి, నిధుల గురించి పూర్తి వివరాలను సేకరించేందుకు ఎఫ్‌ఐఆర్, రిమాండ్ రిపోర్టులు, వాంగ్మూలాలను అందజేయాలని సీఐడీని కోరింది.

 

HCAలో 2019 నుంచి 2022 వరకు జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని సీఐడీ, ఈడీని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కోరింది. ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈడీ ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తూ, నిందితుల నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ దర్యాప్తు ఫలితాలు HCAలో దీర్ఘకాలంగా జరుగుతున్న అవినీతిని బయటపెట్టే అవకాశం ఉంది.

 

ఉప్పల్‌ సీఐ ఎలక్షన్‌రెడ్డి సస్పెన్షన్‌

ఉప్పల్‌ సీఐ ఎలక్షన్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్కామ్‌లో ప్రమేయం ఉందని తేలడంతో ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. హెచ్‌సీఏ జనరల్ సెక్రెటరీ దేవరాజు అరెస్టుకు సీఐడీ రంగం సిద్ధం చేసింది. దేవ్‌రాజ్‌కు సహకరించిన ఎలక్షన్‌ రెడ్డి.. సీఐడీ సమాచారాన్ని ముందుగానే లీక్‌ చేశారు. సీఐడీ సమాచారాన్ని దేవరాజుకు ముందుగా లీక్ చేసినందుకు ఎలక్షన్‌ రెడ్డిని సస్పెండ్‌ అయ్యారు. మరోవైపు, హెచ్‌సీఐ అక్రమాలపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) మరోసారి సీఐడీకి ఫిర్యాదు చేసింది. ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయంపై కూడా విచారణ జరపాలని కోరింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత పేర్లను సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో టీసీఏ ప్రస్తావించింది.

తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు సీఐడీ అడిషనల్‌ డీజీ చారుసిన్హాను కలిశారు. ఈ సందర్భంగా… హెచ్‌సీఏ అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని టీసీఏ ఆరోపించింది. జగన్మోహన్‌రావుతో పాటు మరికొందరు అక్రమార్కులు కూడా ఉన్నారని.. వాళ్లపై కూడా దర్యాప్తు చేయాలని కోరింది. జాన్ మనోజ్, విజయానంద్, పురుషోత్తం అగర్వాల్, సురేందర్ అగర్వాల్, వంకా ప్రతాప్‌లపై కూడా టీసీఏ ఫిర్యాదు చేసింది.

కాగా.. హెచ్‌సీఏ- ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వివాదం నేపథ్యంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు జగన్మోహన్‌ రావును సీఐడీ ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు కోశాధికారి శ్రీనివాస్ రావు, సీఈఓ సునీల్ కంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవితలను కూడా అరెస్టు చేశారు. ఈ క్రమంలో జగన్మోహన్‌ రావు అక్రమ పద్ధతిలో హెచ్‌సీఏలోకి ప్రవేశించినట్లు సీఐడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో మల్కాజిగిరీ కోర్టు నిందితులకు పన్నెండు రోజుల రిమాండ్‌ విధించింది.

Leave A Reply

Your Email Id will not be published!