Eknath Shinde: కమెడియన్‌ కామ్రా వివాదంపై స్పందించిన ఏక్‌ నాథ్‌ శిందే

కమెడియన్‌ కామ్రా వివాదంపై స్పందించిన ఏక్‌ నాథ్‌ శిందే

Eknath Shinde : మహారాష్ట్ర రాజధాని ముంబైలోని యూనికాంటినెంటల్‌ హోటల్‌ లోని హాబిటాట్‌ కామెడీ స్టూడియోలో నిర్వహించిన ఓ వినోద కార్యక్రమంలో స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కామ్రా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఇందులో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌ నాథ్‌ శిందే(Eknath Shinde)ను ఉద్దేశ్యించి స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కామ్రా చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించిన… శివసేన కార్యకర్తలు ఆ స్టూడియోపై దాడి చేసి ఫర్నీచర్ ను ధ్వంసం చేసారు. ఈ కేసులో సుమారు 40 శివసేన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసారు. అలాగే… ఈ స్టూడియో అక్రమ నిర్మాణమంటూ బృహన్‌ ముంబయి పురపాలక సంస్థ కూల్చేసింది. అంతేకాదు ఏక్‌నాథ్‌ శిందేను అవమానపరిచినందుకు కునాల్‌ కామ్రా క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సోమవారం డిమాండ్‌ చేశారు.

Eknath Shinde Comment

అయితే ఈ స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కామ్రా చేసిన వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే(Eknath Shinde) తొలిసారిగా స్పందించారు. కామ్రా వ్యాఖ్యలు ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ‘సుపారీ’ తీసుకున్నట్లు ఉన్నాయని మంగళవారం ఓ మరాఠీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే మాట్లాడుతూ… ‘‘వాక్‌ స్వాతంత్య్రం ఉంది. మేము వ్యంగ్యాన్ని అర్థం చేసుకుంటాం. కానీ దానికీ ఒక హద్దు ఉంటుంది. అవతలి వ్యక్తి కూడా ఒక స్థాయి వరకే మాట్లాడాలి. లేదంటే చర్యకు ప్రతిచర్య ఉంటుంది.

అదే వ్యక్తి (కామ్రా) సుప్రీంకోర్టు, ప్రధాని, అర్ణబ్‌ గోస్వామి (జర్నలిస్ట్‌), ఇతర వ్యాపారవేత్తలపైనా వ్యాఖ్యలు చేశాడు. ఇది భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కాదు. ఒకరికోసం పనిచేయడమే’’ అని శిందే అన్నారు. కార్యక్రమం జరిగిన స్టూడియోను శివసేన కార్యకర్తలు ధ్వంసం చేయడంపై మాట్లాడుతూ..‘‘దీని గురించి నేను ఎక్కువగా మాట్లాడను. ఇలాంటి వాటిని నేను సమర్థించను’’ అని తెలిపారు.

క్షమాపణ చెప్పను – కునాల్‌ కామ్రా

ఏక్ నాథ్ శిందేపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పనని కునాల్‌ కామ్రా స్పష్టం చేశారు. ‘‘నేను క్షమాపణ కోరబోను. శిందే గురించి ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ అన్న మాటలనే నేనూ అన్నాను. దాడులకు పాల్పడుతున్న వారిని చూసి భయపడను’’ అని కునాల్‌ ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. మరోవైపు.. శిందేపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణం చూపుతూ కునాల్‌పై ముంబయి పోలీసులు నమోదు చేసిన కేసులో విచారణకు హాజరు కావాలంటూ… మంగళవారం ఖార్‌ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.

Also Read : Minister Nara Lokesh: మంత్రి నారా లోకేష్ సమక్షంలో సిస్కోతో ప్రభుత్వం ఒప్పందం

Leave A Reply

Your Email Id will not be published!