Election Commission: ఎన్నికల్లో వివక్షకు తావులేదు, మాకు అన్నీ పార్టీలూ సమానమే – ఈసీ

ఎన్నికల్లో వివక్షకు తావులేదు, మాకు అన్నీ పార్టీలూ సమానమే - ఈసీ

Election Commission : ఎన్నికల కమిషన్‌ ఎలాంటి వివక్షకు తావీయదని, తమకు అన్ని పార్టీలు సమానమేనని ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ అన్నారు. ఎన్నికల కమిషన్ తటస్థంగా ఉంటూ రాజ్యాంగ బాధ్యతలకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ విపక్షాల నుంచి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో ఎన్నికల కమిషన్ (Election Commission) ఆదివారం మధ్యాహ్నం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. సీఈసీతో పాటు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Election Commission Key Comments

ఈ సందర్భంగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ… భారత రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే ఏ పార్టీ అయినా పుడుతుందని, అలాంటప్పుడు రాజకీయ పార్టీలపై ఎన్నికల కమిషనర్ ఎలా వివక్ష చూపిస్తుందని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్‌కు ఏ పార్టీ పట్ల విముఖత ఉండదని, అన్ని పార్టీలు సమానమేనని చెప్పారు. ఎవరు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా రాజ్యాంగ బాధ్యతల నుంచి ఎన్నికల కమిషన్ వెనక్కు మళ్లే ప్రసక్తే లేదన్నారు. పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటు రిజిస్టర్ చేసుకోవాలని రాజ్యాంగం నిర్దేశిస్తోందని సీఈసీ అన్నారు. తమకు అన్ని పార్టీలు సమానమేనని, పార్టీల సిద్ధాంతాలు, అఫిలియేషన్‌తో తమకెలాంటి సంబంధం ఉండదని, చట్టప్రకారం అందర్నీ సమనంగా చూస్తామని వివరించారు.

బిహార్ ఎస్ఐఆర్‌పై జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ, డబుల్ ఓటింగ్ ఆరోపణలను తోసిపుచ్చారు. ఆరోపణలు చేసేటప్పుడు ప్రూఫ్ ఉండాలని, ఫ్రూవ్‌లు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ‘కొందరు డబుల్ ఓటింగ్ అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ప్రూఫ్ అడిగితే జవాబు ఇవ్వడం లేదు. ఇలాంటి తప్పుడు ఆరోపణలకు ఎన్నికల కమిషన్ కానీ, ఓటర్లు కానీ భయపడరు. దేశ ఓటర్లను లక్ష్యంగా పెట్టుకుని ఎన్నికల కమిషన్‌ భుజంపై తుపాకి పెట్టే రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. పేదలు, ధనికులు, వృద్ధులు, యువకులు, మహిళలు, మతం, సామాజిక-అర్థిక హోదా అనే వివక్షకు తావులేకుండా అన్ని వర్గాల ఓటర్లకు ఎలక్షన్ కమిషన్ అండగా నిలుస్తోంది. ఇకముందు కూడా నిలుస్తుంది. ఎన్నికల కమిషన్ నిర్భీతిగా వ్యవహరిస్తుంది’ అని స్పష్టం చేశారు.

రాజ్యాంగం ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో భారత పౌరులు మాత్రమే ఓటు వేసేందుకు అర్హులని సీఈసీ (CEC) చెప్పారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో విదేశీ జాతీయులు ఎవరైనా దరఖాస్తులు సమర్పిస్తే వాళ్లు తమ జాతీయతను తగిన డాక్యుమెంట్లతో సహా రుజువు చేసుకోవాలని, వెరిఫికేషన్ తరువాత నాన్ సిటిజన్ల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తామని చెప్పారు. బీహార్ ఎస్ఐఆర్‌ను విజయవంతం చేసేందుకు ఈ ప్రక్రియలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉన్నారని చెప్పారు.

Election Commission – రాహుల్‌ కు ఏడురోజులు గడువు ఇచ్చిన ఈసీ

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ‘ఓట్ చోరీ’ ఆరోపణలపై భారత ఎన్నికల సంఘం (Election Commission) సూటిగా స్పందించింది. ఏడు రోజుల్లోగా అఫిడవిట్ సమర్పించాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని ఆయనకు అల్టిమేటం ఇచ్చింది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణల్లో నిజం లేనట్టేనని పేర్కొంది. ఈ సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్‌పై ఆరోపణలు నిరాధారమని అన్నారు. ‘మీ ఆరోపణలపై అఫిడవిట్ సమర్పించాలి. లేదా దేశానికి క్షమాపణ చెప్పాలి. మూడో ఆప్షన్ లేదు. ఏడు రోజుల్లోగా అఫిడవిట్ మాకు అందకుంటే దాని అర్ధం ఆ ఆరోపణల్లో నిజం లేనట్టే’ అని ఆయన అన్నారు.

డబుల్ ఓటింగ్, ఓట్ చోరీ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)ను విజయవంతం చేసేందుకు ఈ ప్రక్రియలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉన్నారని చెప్పారు. ఎన్నికల కమిషన్ నిర్భీతిగా, ఎలాంటి వివక్షకు తావులేకుండా అన్ని వర్గాల ప్రజల పక్షాన నిలుస్తుందని తెలిపారు. డబుల్ ఓటింగ్‌పై కొందరి ఆరోపణలను ప్రస్తావిస్తూ, సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు సరికాదని, ఇలాంటి ఆరోపణలకు దేశంలోని ఓటర్లు కానీ, ఎన్నికల కమిషన్ కానీ భయపడే ప్రసక్తే లేదన్నారు.

రాహుల్ గాంధీ బిహార్‌లో ఆదివారంనాడు ప్రారంభించిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో ఈసీపై విమర్శలు గుప్పించారు. తనను మాత్రమే ఈసీ అఫిడవిట్ సమర్పించాలని డిమాండ్ చేస్తోందని, బీజేపీ నేతలు కొద్దిరోజుల క్రితం ప్రెస్‌మీట్ పెట్టినప్పుడు వాళ్లను అఫిడవిట్ ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.

Election Commission – బీహార్ ఓటరు జాబితా సవరణకు మరో 15 రోజులు

బిహార్ ముసాయిదా ఎన్నికల జాబితాలో సవరణలకు మరో 15 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. అన్ని పార్టీలకు సమానంగా ఈసీ తలుపులు తెరిచి ఉన్నాయని చెప్పారు. బీహార్ ఎస్ఐఆర్ కింద ముసాయిదా ఎన్నికల జాబితాపై ఏ రాజకీయ పార్టీకి ఎలాంటి అనుమానులు ఉన్నా తమను సంప్రదించవచ్చని ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సిసీటీవీ ఫుటేజ్‌ను షేర్ చేయకపోవడానికి ఓటర్ల ప్రైవేసీని కాపాడాలన్నదే కారణమని సీఈసీ చెప్పారు. సీసీటీవీ ఫుటే‌జ్‌ను ఎన్నికల కమిషన్ షేర్ చేయకపోవడంపై రాహుల్ గాంధీ సారథ్యంలోని పలు వివక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అవకతవకలు చోటుచేసుకోవడమే దానికి కారణమని తప్పుపట్టాయి.

దీనిపై సీఈసీ మాట్లాడుతూ, మెషీన్-రిడబుల్ ఎలక్టోరల్ రోల్స్‌కు సంబంధించి సుప్రీంకోర్టు 2019లో చాలా స్పష్టంగా చెప్పిందని, ఇందువల్ల ఓటర్ల ప్రైవసీకి భంగం కలుగుతుందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొందని తెలిపారు. గత కొద్దిరోజులుగా పలువురు ఓటర్ల ఫోటోలు వాడుకుంటూ వాటిని మీడియాకు ఫార్వార్డ్ చేస్తుండటం చూస్తున్నామని, అలాంటప్పుడు మన తల్లులు, ఆడకూతుళ్ల ఫోటోలతో కూడిన సీసీటీవీ ఫుటేజ్‌ను కమిషన్ షేర్ చేయాలా? అని సీఈసీ ప్రశ్నించారు.

Also Read : Tamil Nadu: తమిళనాడు గవర్నర్‌, సీఎం మధ్య మరోసారి బగ్గుమన్న విభేదాలు

Leave A Reply

Your Email Id will not be published!