Election Commission: ఈవీఎంల బ్యాలెట్ పేపర్లపై కలర్ ఫోటో

ఈవీఎంల బ్యాలెట్ పేపర్లపై కలర్ ఫోటో

Election Commission : ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంల బ్యాలెట్‌ పేపర్లపై అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు కలర్‌ ఫొటోలను ఏర్పాటు చేయనుంది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నుంచే ఈ కొత్త నిబంధన అమలు చేయనున్నట్లు తెలిపింది. ఈవీఎం బ్యాలెట్‌ పేపర్ల రూపకల్పన, ముద్రణ మార్గదర్శకాలను బుధవారం ఎన్నికల సంఘం సవరించింది. ఇకనుంచి కొత్త బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల కలర్ ఫొటోలు దర్శనమివ్వనున్నాయి. ఓటర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు కేటాయించిన స్థలంలో మూడొంతుల వరకు అభ్యర్థి ముఖాన్ని ముద్రించనున్నారు. ఎన్నికల ప్రక్రియలో ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా గత ఆరు నెలల కాలంలో తీసుకువచ్చిన 28 మార్పుల్లో తాజా నిర్ణయం కూడా భాగమని ఎన్నికల సంఘం వెల్లడించింది. అలాగే అభ్యర్థుల సీరియల్ నంబర్లను 30 ఫాంట్‌ సైజ్‌తో బోల్డ్‌లో ముద్రించనున్నారు. అభ్యర్థుల పేర్లు, నోటా ఆప్షన్‌ను కూడా అదే నిబంధన వర్తించనుంది.

Election Commission New Update

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM) అనేది భారతదేశంలో ఎన్నికల నిర్వహణ కోసం ఉపయోగించే ఒక పోర్టబుల్ ఎలక్ట్రానిక్ పరికరం. పేపర్ బ్యాలెట్ విధానానికి ప్రత్యామ్నాయంగా రూపొందించబడిన ఈ వ్యవస్థపై రాజకీయ పార్టీల అభ్యంతరాల సంగతి తెలిసిందే. అయితే అవకతవకలకు ఎలాంటి తావు లేదంటూ ఈవీఎంలను కేంద్ర ఎన్నికల సంఘం సమర్థించుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది చివర్లో జరగనున్న బిహార్‌ ఎన్నికల నుంచి ఈసీ కొత్త నిబంధనలు అమలు చేయనుంది. ఈవీఎంలపై గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్‌ ఫొటోలు ఏర్పాటు చేయనుంది. ఈవీఎంపై 20 ఎంఎం సైజులో అభ్యర్థి కలర్ ఫోటోతో పాటు 40 ఎంఎం సైజులో పార్టీ సింబల్ ఉంచనున్నారు. బిహార్‌ ఎన్నికల నుంచి ఈ ప్రక్రియను ఎన్నికల కమిషన్‌ ప్రారంభించనుంది.

కాగా, దేశవ్యాప్తంగా పలు లోక్‌సభ నియోజకవర్గాల్లో లక్షలాది ఓట్లను తొలగించి పరోక్షంగా ఓటుహక్కును అపహరించారన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపణలను ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానే శ్రీకుమార్ ఇటీవల తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. “ఆయన ఆరోపణల మేరకు ఓటు చోరీపై ఏడు రోజుల్లో సమగ్ర అఫిడవిట్ సమర్పించాలి. లేని పక్షంలో దేశప్రజలకు తక్షణం క్షమా పణ చెప్పాలి” అంటూ డిమాండ్ చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ చేపట్టిన ఓటు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) అత్యంత పారదర్శకంగా సాగుతోందని సీఈసీ చెప్పారు. దీనిపై కొన్ని విపక్షాలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నాయన్నారు. శాశ్వత స్థిరనివాసంలో ఒకటి, వేరే ప్రాంతానికి వలస వెళ్లడం వల్ల మరోటి… ఇలా కొందరికి రెండు ఓటర్ గుర్తింపు కార్డులు ఉండొచ్చు. ఇలాంటి తప్పిదాలను సరిచేసేందుకు పోలింగ్ యంత్రాంగం కృషి చేస్తోందంటూ ఆయన చెప్పుకొచ్చారు.

Also Read : Minister Jupally Krishna Rao: గిన్నిస్ బుక్ రికార్డులో చేరేలా బతుకమ్మ సంబరాలు – మంత్రి జూపల్లి

Leave A Reply

Your Email Id will not be published!