Election Commission of India: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం ! సీఎస్‌, డీజీపీకి సమన్లు !

ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం ! సీఎస్‌, డీజీపీకి సమన్లు !

Election Commission of India: పల్నాడు, తాడిపత్రి, చంద్రగిరి సహా పలుచోట్ల జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ(Election Commission of India) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల్లోనూ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘం(Election Commission of India) రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాలను ఆదేశించింది. ఈ ఘటనలపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఈసీ సమన్లు పంపింది. హింసాత్మక ఘటనలు జరుగుతాయని ముందే హెచ్చరికలు ఉన్నా… పోలింగ్ రోజు అంత నిర్లిప్తంగా ఎందుకు వ్యవహరించారని ఈసీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఈమేరకు ఇద్దరు అధికారులు గురువారం ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వనున్నారు.

Election Commission of India Comment

పోలింగ్‌ అనంతరం మంగళవారం తాడిపత్రి, తిరుపతి, కారంపూడి రణరంగంగా మారాయి. తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళ విశ్వవిద్యాలయం ఆవరణలో వైసీపీ నాయకులు మారణాయుధాలతో రెచ్చిపోయారు. ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్‌ రూమ్‌ లను పరిశీలించేందుకు వచ్చిన చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం చేశారు. చంద్రగిరి వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి… ఆయన కుమారుడు, ప్రస్తుతం పార్టీ అభ్యర్థి మోహిత్‌ రెడ్డిల అనుచరులు సమ్మెట, కర్రలు, రాళ్లు, బీరు సీసాలతో దాడులు చేస్తూ వీరంగం సృష్టించారు. నానితోపాటు ఆయన డ్రైవర్‌, గన్‌మెన్లపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. తేరుకునేలోగానే దుండగులు దాడి చేయడంతో గన్‌మెన్‌ గాల్లోకి కాల్పులు జరిపారు. వెరవకుండా వైసీపీ మూకలు దాడిని కొనసాగించడంతో నాని భుజానికి గాయాలయ్యాయి. గన్‌మెన్‌ తలకూ తీవ్రగాయమైంది. ఎన్నికలతో పాటు అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపట్ల స్థానిక అధికారులు నిర్లిప్తంగా, నిర్లక్ష్యంగా వదిలేసినట్టు ఈసీ గుర్తించింది. పల్నాడులో స్వయంగా పర్యటించిన ఏపీ ప్రత్యేక అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రా ఈ అంశాలను నేరుగా సీఈసీకి నివేదించినట్టు తెలుస్తోంది.

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన అనుచరులతో విధ్వంసం సృష్టించారు. తన కారుపై ఎవరో రాయి వేశారనే నెపంతో టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కారంపూడి మీదుగా వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌లోని ఓ కారుపై గుర్తుతెలియని వ్యక్తి రాయి విసిరాడనే నెపంతో ఆగ్రహంతో ఊగిపోయారు. సమీపంలోనే ఉన్న టీడీపీ కార్యాలయం వైపు కాన్వాయ్‌ వెళ్లి ఆగింది. కార్లలో ఉన్న వైసీపీ గూండాలు కర్రలు, కత్తులు, రాడ్లు బయటకు తీసి టీడీపీ కార్యాలయంలోకి దూసుకెళ్లారు. కుర్చీలను పగలగొట్టారు. రాళ్లు విసిరారు. ఫ్లెక్సీలను చించేశారు. తలుపులు ధ్వంసం చేశారు. అటుగా కారులో వెళ్తున్న టీడీపీ కార్యకర్త మస్తాన్‌ జానీబాషా కుమారుడు బుడ్డు, షేక్‌జాన్‌ను అడ్డుకున్నారు. వారిని బయటకు రప్పించి దాడి చేసి, ఆపై కారుకు నిప్పుపెట్టారు. రోడ్లపై తిరుగుతూ బీభత్సం సృష్టించారు. దుకాణదారులపైనా దాడులకు తెగబడ్డారు.

యుద్ధభూమిగా తాడిపత్రి !

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు విధ్వంసకాండను సృష్టించారు. తాడిపత్రిని యుద్ధభూమిగా మార్చారు. తాడిపత్రిలోని చింతలరాయుని పాళెంలో ఉన్న వైసీపీ ఏజెంట్లు సంజీవ, అజయ్‌, మరో నలుగురు కలసి టీడీపీ ఏజెంట్‌ భాను, ఆ పార్టీ వర్గీయుడు మోహన్‌లపై దాడికి దిగారు. అంతలో టీడీపీ నాయకుడు సూర్యముని అనుచరులు వైసీపీ ఏజెంట్‌ సంజీవను నిలదీయగా అతను ఎమ్మెల్యే పెద్దారెడ్డి దృష్టికి తీసుకెళ్లాడు. ఎమ్మెల్యే ఆవేశంతో ఊగిపోయి నా వర్గీయుడినే ప్రశ్నిస్తారా? అని తన అనుచరులతో సూర్యముని ఇంటి వద్దకు వెళ్లి రాళ్లదాడికి దిగారు. స్పెషల్‌ కమాండెంట్‌ శ్రీనివాసరావు… బలగాలతో వెళ్లి అల్లరి మూకలను చెదరగొట్టారు. వైసీపీ మూకల దాడిలో ఆయనతోపాటు పట్టణ సీఐ మురళీకృష్ణకు తీవ్రగాయాలయ్యాయి.

Also Read : Telangana Formation Day: కెనడాలో ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు !

Leave A Reply

Your Email Id will not be published!