Election Commission: ఓటర్ ఐడీతో ఆధార్ అనుసంధానానికి ఈసీ గ్రీన్ సిగ్నల్
ఓటర్ ఐడీతో ఆధార్ అనుసంధానానికి ఈసీ గ్రీన్ సిగ్నల్
Election Commission : ఓటరు జాబితాల తయారీలో అక్రమాలు జరిగాయంటూ విపక్షాలు తీవ్రస్ధాయితో విమర్శిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటరు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు న్యూఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు, కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారులతోపాటు ఎలక్ట్రానిక్స్ ముఖ్య కార్యదర్శి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆధార్ తో ఓటరు కార్డు అనుసంధానంపై కీలక ప్రకటన చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం-1950, సుప్రీంకోర్టు(Supreme Court) మార్గదర్శకాలకు లోబడి ఈ అనుసంధాన ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపింది. ఇందుకోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఈసీ సాంకేతిక నిపుణుల మధ్య త్వరలోనే చర్చలు ప్రారంభం అవుతాయని ఓ ప్రకటనలో పేర్కొంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, కమిషనర్లు సుఖ్బిర్ సింగ్ సందు, వివేక్ జోషీలు మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి, లెజిస్లేచర్ కార్యదర్శి (న్యాయ మంత్రిత్వశాఖ), ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి, యూఐడీఏఐ సీఈవోతో పాటు ఈసీ(Election Commission) సాంకేతిక నిపుణులతో సమావేశమై చర్చించారు.
Election Commission New Updates
రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం… భారతీయ పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. అయితే, ఆధార్ కేవలం వ్యక్తి గుర్తింపును మాత్రమే నిర్ధారించగలిగే పత్రం. అందువల్ల ఓటర్ల గుర్తింపు కార్డుని ఆధార్ తో అనుసంధానించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్లు 23(4), 23(5), 23(6) నిబంధనలు, 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఇందులో భాగంగా యూఐడీఏ, ఈసీ(Election Commission) టెక్నికల్ నిపుణుల మధ్య చర్చలు త్వరలోనే ప్రారంభం కానున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.
దేశంలో ప్రతి పౌరుడు తన ఆధార్ కార్డును ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలకు అనుసంధానం చేశాడు. అలాగే పాన్ కార్డుతో సైతం అనుసంధానం చేశారు. అయితే ఆధార్ కార్డును… ఓటర్ గుర్తింపు కార్డుతో అనుసంధానం చేయాలంటూ గత కొంత కాలంగా డిమాండ్ వినిపిస్తోంది. ఆ క్రమంలో పలువురు కోర్టుల తలుపు సైతం తట్టారు. అలాంటి వేళ… కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రజాస్వామిక వాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామిక దేశం. ప్రతి ఏటా దేశంలో ఎక్కడో అక్కడ.. ఎప్పుడో అప్పుడు ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి వేళ… కొందరి పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగిస్తున్నారు. అది కూడా వారి ప్రమేయం లేకుండానే. దీనితో ఈ అంశంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక మిన్నకుండి పోతున్నారు. అలాంటి వారికి ఓటరు గుర్తింపు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల… ఈ తరహా తప్పులు భవిష్యత్తులో పునరావృతం కావనే ఓ భావన సాధారణ ఓటరులో ప్రారంభమైంది.
Also Read : Sunita Williams: అంతరిక్షం నుండి క్షేమంగా భూమికి చేరుకున్న సునీతా విలియమ్స్