Rahul Gandhi: రాహుల్‌ గాంధీపై ఎన్నికల కమీషన్ ఆగ్రహాం

రాహుల్‌ గాంధీపై ఎన్నికల కమీషన్ ఆగ్రహాం

Rahul Gandhi : బీజేపీ, ఎన్నికల సంఘం (EC) కలిసి ఎన్నికల్లో ‘భారీ నేరపూరిత మోసానికి’ పాల్పడ్డాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేస్తున్న సంచలన ఆరోపణలపై ఎలక్షన్‌ కమిషన్‌ (Election Commission) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. బిహార్‌లో 65 లక్షల ఓట్లను తొలగిస్తున్నామని తాము ఆగస్టు 1న ప్రకటన విడుదల చేసినా… మార్పులు చేర్పులపై ఇప్పటివరకు ఏ పార్టీ తమను సంప్రదించలేదని ఈసీ స్పష్టం చేసింది. ఓట్ల తొలగింపుపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ముసాయిదాపై ఇంతవరకు ఎటువంటి అభ్యంతరాలు నమోదు చేయలేదని పేర్కొంది. అభ్యంతరాలు చెప్పడానికి ఆయన ఎందుకింత ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించింది.

Election Commission Slams Rahul Gandhi

తాము విడుదల చేసిన ఓట్ల తొలగింపు ముసాయిదాపై తన అభ్యంతరాలను రాహుల్‌ గాంధీ ఇప్పుడు కాకుండా ఎప్పటిలాగే బిహార్‌ ఎన్నికలు పూర్తయ్యాక మాత్రమే ఇస్తారేమో అంటూ ఈసీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల సమయంలో జరిగిన ఓట్ల చోరీ గురించి రాహుల్‌ గాంధీ ఎన్నికల సంఘాన్ని హెచ్చరించిన అనంతరం ఈసీ ఈ వ్యాఖ్యలు చేసింది.

రాహుల్‌ వాదనలు తప్పని ‘ఈసీ’కెలా తెలుసు ? – ప్రియాంక గాంధీ సూటి ప్రశ్న

ఎన్నికల రిగ్గింగ్‌కు సంబంధించి రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు సమర్పించాలని ఎన్నికల కమిషన్ రాహుల్‌ను సవాల్‌ చేయడంపై కాంగ్రెస్‌ (Congress) ఎంపీ ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. మహారాష్ట్ర, హరియాణా మొదలైన ప్రాంతాల్లో ఎన్నికల సమయంలో అవకతవకలు జరిగినట్లు పేర్కొన్న వెంటనే ఈసీ ఆ విషయంలో దర్యాప్తు చేయడం మానేసి… రాహుల్‌గాంధీ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని దబాయిస్తోందన్నారు. అసలు దర్యాప్తే చేయనప్పుడు ఆయన వాదనలు తప్పని ఎన్నికల కమిషన్‌కు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. తాము సమర్పించిన ఆధారాలు ఈసీ ముందే ఉన్నాయని… వాటిని పరిణగణలోకి తీసుకొని దర్యాప్తు చేయాలని సూచించారు. తాము ఆందోళన వ్యక్తంచేస్తోంది కేవలం ఒక పార్టీ గురించి మాత్రమే కాదని.. దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థ గురించని ఆమె పేర్కొన్నారు.

ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి – రాహుల్‌ గాంధీ

రాజ్యాంగ విలువలను అపహాస్యం చేసేటప్పుడు, రాజ్యాంగంపై దాడి చేసేటప్పుడు ఎన్నికల అధికారులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) హెచ్చరించారు. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిన వారిని పట్టుకోవడానికి ఎక్కువ సమయం పట్టినా… ఎప్పటికైనా తప్పనిసరిగా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. తాను చేస్తున్న ఆరోపణలపై ప్రమాణం చేయాలని ఈసీ చేస్తున్న డిమాండ్‌ను తిప్పికొట్టారు. తాను ఇప్పటికే ఎంపీగా పార్లమెంట్‌ సాక్షిగా రాజ్యాంగంపై ప్రమాణం చేశానన్నారు.

ఈసీకి రాహుల్‌ ఐదు ప్రశ్నలు

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మరోసారి కేంద్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్‌ చేశారు. ఎక్స్‌ వేదికగా ఈసీకి ఐదు ప్రశ్నలు సంధించారు. ఎన్నికల సంఘం బీజేపీతో చేతులు కలిపి, దేశంలో ఎన్నికలను ప్రభావితం చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీకి మేలు చేయడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం పని చేస్తోందంటూ.. ఆధారాలతో సహా బయటపెట్టారు. ఓటర్ల జాబితాల్లో విచ్చలవిడిగా నకిలీ ఓటర్లను చేరుస్తోందని ఆరోపించారు.

ఈ క్రమంలో మరో ఐదు ప్రశ్నలతో ఎన్నికల సంఘాన్ని నిలదీశారు. ‘‘డిజిటల్‌ ఓటర్‌ జాబితా ఎందుకు ఇవ్వడం లేదు?. సీసీ టీవీ ఆధారాలు ఎందుకు నాశనమయ్యాయి?. నకిలీ ఓట్ల నమోదును ఎందుకు అడ్డుకోలేపోతున్నారు?. ప్రతిపక్ష నేతలను ఎందుకు బెదిరిస్తున్నారు?. బీజేపీకి ఎన్నికల సంఘం ఏజెంట్‌గా మారిందా?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

కాగా, ఇవాళ (శుక్రవారం) బెంగళూరులో ఓట్‌ అధికార్‌ ర్యాలీ పేరిట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఓటర్‌ జాబితా అవకతవకలతోనే బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిందని, ఎన్నికల సంఘం రాజ్యాంగానికి గనుక కట్టుబడి ఉంటే తాము కోరిన వివరాలను అందించాలని రాహుల్‌ గాంధీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో మా సర్వే ప్రకారం.. 15 నుంచి 16 సీట్లు గెలుస్తుందని అంచనా వేశాం. కానీ, 9 మాత్రమే గెలిచాం. ఆ ఫలితాలను విశ్లేషించినప్పుడు.. నిజంగానే మేం ఓడిపోయామా? అనిపించింది. వెంటనే ఓటర్ల సాఫ్ట్‌ కాపీని ఇవ్వమని ఈసీని కోరాం. కానీ, ఈసీ అందుకు నిరాకరించింది. ఎన్నికల వీడియోలు కావాలని కోరినా.. రూల్స్‌ మారిపోయాయంటూ ఇవ్వడానికి ఒప్పుకోలేదంటూ రాహుల్‌ చెప్పుకొచ్చారు.

Also Read : India Union Government: పౌరసత్వం వదులుకుంటున్న భారతీయులు ! కారణమేమిటంటే ?

Leave A Reply

Your Email Id will not be published!