Ex MLA Rosaiah : జనసేనలో చేరనున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య
కిలారి రోశయ్యను టీడీపీలో చేరాలని కొందరు సూచించినా....
Ex MLA Rosaiah : వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకోనున్నారు. 2019 ఎన్నికల్లో పొన్నూరు శాసనసభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి దూళిపాళ్ల నరేంద్రపై విజయం సాధించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పొన్నూరు టికెట్‌ను ఆయనకు కేటాయించలేదు.
గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించింది. రోశయ్య(Ex MLA Rosaiah) ఇష్టం లేకపోయినా ఎంపీగా పోటీచేశారు. ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశారు. పొన్నూరు అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవడంతో రోశయ్య పార్టీలోనే ఉన్నా తీవ్ర అసంతృప్తితో ఉంటూ వచ్చారు. ఎన్నికల ఫలితాలు వైసీపీకి సానుకూలంగా రాకపోవడంతో వైసీపీకి ఆయన ఇటీవల రాజీనామా చేశారు. తన అనుచరులతో చర్చించిన తర్వాత జనసేనలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మంగళగిరి పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో కిలారి రోశయ్య జనసేనలో చేరనున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలో చేరాలనేదానిపై తీవ్రంగా ఆలోచించిన కిలారి రోశయ్య(Ex MLA Rosaiah) చివరకు జనసేనను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
Ex MLA Rosaiah will Join in…
కిలారి రోశయ్యను టీడీపీలో చేరాలని కొందరు సూచించినా.. ఆ పార్టీలో కిలారి రోశయ్యను చేర్చుకునే అవకాశాలు తక్కువుగా ఉండటంతో ఆయన జనసేనలోకి వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారట. టీడీపీ నుంచి పొన్నూరు నియోజకవర్గంలో బలమైన నేతగా దూళిపాళ్ల నరేంద్ర ఉన్నారు. దూళిపాళ్లకు, రోశయ్యకు వ్యక్తిగతమైన కక్షలు ఏమి లేకపోయినప్పటికీ రాజకీయంగా 2019 నుంచి 2024 వరకు ఇద్దరు వేర్వేరు పార్టీల నుంచి ప్రత్యర్థులుగా తలపడ్డారు. ఐదేళ్లపాటు దూళిపాళ్ల నరేంద్రను అప్పటి వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పెట్టింది. అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించిందనే విమర్శలు ఉన్నాయి. పొన్నూరు నియోజకవర్గంలో దూళిపాళ్ల నరేంద్రను వైసీపీ టార్గెట్ చేసింది. అయినప్పటికీ ఆయన వైసీపీ అరాచకాలకు ఎదురొడ్డి నిలబడ్డారు. ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉంది. ఈ సమయంలో కిలారి రోశయ్యను పార్టీలో చేర్చుకుంటే కేడర్‌కు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లవుతుందనే ఆలోచనతో రోశయ్యను టీడీపీలో చేర్చుకోకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతోనే రోశయ్య టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేయకుండా.. జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట.
కిలారి వెంకట రోశయ్య(Ex MLA Rosaiah) రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు. ఆయన తండ్రి కిలారి కోటేశ్వరరావు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు కౌన్సిలర్‌గా, చైర్మన్‌గా పనిచేశారు. కిలారి కోటేశ్వరరావు 1989లో గుంటూరు-2 అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని రోశయ్య రాజకీయాల్లోకి వచ్చారు. 1985లో జేకేసీ కళాశాల ఉపాధ్యక్షుడిగా కిలారి వెంకట రోశయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు . 1993లో గుంటూరు మిర్చి యార్డు సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1994లో గుంటూరు మిర్చి యార్డు సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై.. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009లో తెనాలి నుంచి పీఆర్పీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు.
Also Read : India Growth : 2030-31 సవత్సరానికి భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందంటున్న ఆ సంస్థ