Faf Du Plessis Surya Kumar : సూర్యా భాయ్ సూపర్ – డుప్లెసిస్
అద్భుతంగా ఆడాడంటూ కితాబు
Faf Du Plessis Surya Kumar : ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా ముంబై వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో దుమ్ము రేపాడు ముంబై ఇండియన్స్ స్టార్ క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్. కేవలం 35 బంతులు మాత్రమే ఎదుర్కొని 83 రన్స్ చేశాడు. ఇందులో 7 ఫోర్లు 6 సిక్సర్లు ఉన్నాయి. కళ్లు చెదిరే షాట్స్ తో అలరించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ 7 రన్స్ కే పరిమితం కాగా క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ ఎక్కడా తగ్గలేదు. సూర్యా భాయ్ తో పాటు ఇషాన్ కిషన్ , నేహాల్ వధేరా దంచి కొట్టారు. దీంతో ఆర్సీబీ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.3 ఓవర్లలోనే ఛేధించారు. 4 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించారు.
ఇదిలా ఉండగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో గ్లెన్ మ్యాక్స్ వెల్ 68 పరుగులతో రెచ్చి పోతే కెప్టెన్ డుప్లెసిస్ 65 పరుగులతో చుక్కలు చూపించాడు ముంబై ఇండియన్స్ బౌలర్లకు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడాడు ఆర్సీబీ స్కిప్పర్ ఫాఫ్ డు ప్లెసిస్. ఈ సందర్భంగా ముంబై స్టార్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ ను ప్రశంసలతో ముంచెత్తాడు.
అద్భుతంగా ఆడాడంటూ కితాబు ఇచ్చాడు. అతడిని తమ బౌలర్లు ఆపలేక పోయారని పేర్కొన్నాడు. ఏది ఏమైనా భారత జట్టుకు అతడు గొప్ప బలంగా మారతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు ఫాఫ్ డుప్లెసిస్.
Also Read : కెప్టెన్ రాణించినా తప్పని ఓటమి