Family Suicide: అమీన్‌పూర్ లో విషాదం ! ఒకే ఇంట్లో ముగ్గురు చిన్నారుల అనుమానాస్పద మృతి !
అమీన్‌పూర్ లో విషాదం ! ఒకే ఇంట్లో ముగ్గురు చిన్నారుల అనుమానాస్పద మృతి !
Family Suicide : సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ లో విషాదం చోటుచేసుకుంది. అనుమానాస్పద రీతిలో ఒకే ఇంట్లో ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. తల్లి తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Family Suicide in Sangareddy
అమీన్‌పూర్(Ameenpur) లోని రాఘవేంద్ర కాలనీలో చెన్నయ్య, ఆయన భార్య రజిత తమ ముగ్గురు పిల్లలు సాయికృష్ణ (12), మధుప్రియ (10), గౌతమ్ (8)తో కలిసి నివాసముంటున్నారు. చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో భార్యాభర్తలతో పాటు ముగ్గురు పిల్లలు ఇంట్లోనే భోజనం చేశారు. చెన్నయ్య అన్నం, పప్పు తిన్నాడు. భార్య, ముగ్గురు పిల్లలు పెరుగన్నం తిన్నారు. భోజనం తర్వాత చెన్నయ్య ట్యాంకర్ నడిపేందుకు చందానగర్ వెళ్లాడు. రాత్రి 11 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి వచ్చాడు. రాజిత తలుపులు తెరవగా… పిల్లలు నిద్రపోతున్నారు.
శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రజితకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో స్థానికుల సహాయంతో చెన్నయ్య ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాడు. ఆ తర్వాత పిల్లలను పరిశీలించగా… అప్పటికే ముగ్గురూ మృతిచెందినట్లు గుర్తించారు. దీనితో ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెన్నయ్యది రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెడకపల్లి. ఉపాధి కోసం గత కొంతకాలంగా ఆయన అమీన్‌పూర్ లో ఉంటున్నాడు. చిన్నారుల మృతిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కాగా, ఈ ఘటనలో చిన్నారుల మృతిలో ఎలాంటి నిర్ధారణకు రాలేదని సంగారెడ్డి ఎస్పీ పంకజ్ ప్రకటించారు. తల్లి విషం ఇచ్చి చంపారన్న విషయం ధృవీకరణ కాలేదని… కుటుంబ కలహాలతోనే ఘాతుకం జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని మీడియాకు తెలిపారు. ప్రస్తుతానికి రజిత ఆరోగ్యం నిలకడగానే ఉందన్న ఎస్పీ… ఫోరెన్సిక్ నిపుణులు శాంపిల్స్ సేకరించారని, పిల్లల మృతదేహాలకు పోస్టుమార్టంలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని తెలిపారు.
Also Read : CM Revanth Reddy :డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తూ తెలంగాణా అసెంబ్లీ తీర్మానం