Fighter Jets: గంగా ఎక్స్‌ప్రెస్‌ వేపై ఫైటర్ జెట్ లు ల్యాండింగ్, టేకాఫ్

గంగా ఎక్స్‌ప్రెస్‌ వేపై ఫైటర్ జెట్ లు ల్యాండింగ్, టేకాఫ్

Fighter Jets : పహల్గాం ఉగ్రదాడితో పాకిస్థాన్‌ పై భారత్‌ మెరుపుదాడి చేస్తుందన్న అంచనాల మధ్య భారత వాయుసేన విన్యాసాలు చేపట్టింది. శుక్రవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని(UP) గంగా ఎక్స్‌ప్రెస్‌ రహదారిపై ఫైటర్ జెట్ ల టేకాఫ్, ల్యాండింగ్‌ ఆపరేషన్లు నిర్వహించింది. హైవేలో భాగమైన 3.5 కి.మీ పొడవైన ఎయిర్‌స్ట్రిప్‌ లో రఫేల్, సుఖోయ్‌-30 ఎంకేఐ, మిరాజ్‌-2000, మిగ్‌-29, జాగ్వార్‌ వంటి ఫైటర్లు, సి-130జె, ఏఎన్‌-32 వంటి సైనిక రవాణా విమానాలు, ఎంఐ-17వి5 హెలికాప్టర్ల సన్నద్ధతను పరీక్షించింది. కేవలం మీటరు ఎత్తులో ఫైటర్‌ జెట్లు ప్రదర్శించిన విన్యాసం ఆకట్టుకుంది. తాజా విన్యాసాల నేపథ్యంలో యూపీ ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంది. ఎయిర్‌స్ట్రిప్‌ వద్ద దాదాపు 250 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. చుట్టూ 40 కిలోమీటర్ల విస్తీర్ణంలో భద్రత కల్పించింది. రహదారిపైకి జంతువులేవీ రాకుండా చర్యలు తీసుకుంది.

Fighter Jets Landing

యుద్ధం లేదా, జాతీయ అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ విమానాలు, ఫైటర్‌ జెట్లు రహదారిపై టేకాఫ్‌, ల్యాండింగ్‌ అయ్యేందుకు వీలుగా యూపీలోని షాజహాన్‌పూర్‌ జిల్లాలో గంగా ఎక్స్‌ప్రె్‌సవేపై 3.5 కిలోమీటర్ల పొడవైన ఎయిర్‌స్ట్రిప్ ను నిర్మించారు. అత్యాధునిక లైటింగ్‌, నావిగేషన్‌ వ్యవస్థలు ఉన్న దీనిపై పగలు, రాత్రి ఎప్పుడైనా యుద్ధ విమానాలను ల్యాండింగ్‌, టేకాఫ్‌ చేయవచ్చు. ఇలా ఉదయం-రాత్రి ల్యాండింగ్‌, టేకాఫ్‌ చేసే వీలున్న హైవే ఎయిర్‌స్ట్రిప్‌ భారత్‌ లో ఇదే మొదటిది. అలాగే… ఉత్తరప్రదేశ్‌లోని హైవేలపై నిర్మించిన ఎయిర్‌ స్ట్రిప్ ల్లో ఇది నాలుగోది. గతంలో ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌వే, పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వే, బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై యుద్ధవిమానాల ల్యాండింగ్‌ సౌకర్యాలున్నాయి. తాజాగా గంగా ఎక్స్‌ప్రెస్ వేపై జలాలాబాద్‌ వద్ద నిర్మించిన రన్‌వేను శుక్రవారం ప్రారంభించిన వాయుసేన ఉదయం, రాత్రి వేళ రెండు దశల్లో దీన్ని పరిశీలించింది. ఈ క్రమంలో చేపట్టిన విన్యాసాల్లో రాఫెల్‌, సుఖోయ్‌-30 ఎంకేఐ, మిరాజ్‌-2000, మిగ్‌-29, జాగ్వార్‌, సీ-130జే సూపర్‌ హెర్కులస్‌, ఏఎన్‌-32 యుద్ధ విమానం, ఎంఐ-17 వీ5 హెలికాప్టర్లు పాల్గొన్నాయి.

Also Read : NIA: పహాల్గాం ఉగ్రదాడి ఆ మూడు సంస్థల పనే – ఎన్ఐఏ

Leave A Reply

Your Email Id will not be published!