Amaravati Secretariat: ఏపీ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం
ఏపీ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సచివాలయం రెండో బ్లాక్ లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనితో అప్రమత్తమైన ఎస్పీఎఫ్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఎస్పీఎఫ్ సిబ్బంది సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరగడంతో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీనితో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సచివాలయంలోని రెండో బ్లాక్ లోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు అనిత, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ పేషీలు ఉన్నాయి. దీనితో ఈ అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణకు హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు.
అగ్నిప్రమాద ఘటనపై సమగ్ర విచారణకు హోంమంత్రి ఆదేశం
సచివాలయం రెండో బ్లాక్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటన ప్రాంతాన్ని హోంమంత్రి మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యాటరీలు ఉండే ప్రదేశంలో ప్రమాదం జరిగినట్లు అధికారులు ఆమెకు వివరించారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణకు మంత్రి ఆదేశించారు. బ్యాటరీ, యూపీఎస్ రూమ్ లో ఫైర్ అలారం లేకపోవడంపై అనిత ఆరా తీశారు. సచివాలయంలోని అన్ని బ్లాక్ ల్లో ఫైర్ అలారాలను తనిఖీ చేయాలని సూచించారు. మరోవైపు ఈ ప్రమాదంపై తుళ్లూరు పీఎస్‌లో కేసు నమోదైంది. ప్రమాదవశాత్తూ ఈ సంఘటన జరిగిందా కుట్ర కోణం ఏమైనా ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.