Park Hyatt: పార్క్ హయత్ లో అగ్ని ప్రమాదం ! సన్ రైజర్స్ టీంకు తప్పిన ప్రమాదం !
పార్క్ హయత్ లో అగ్ని ప్రమాదం ! సన్ రైజర్స్ టీంకు తప్పిన ప్రమాదం !
Park Hyatt : హైదరాబాద్ మహానగరంలోని పార్క్ హయత్ హోటల్ లో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. పార్క్ హయత్ మొదటి ఫ్లోర్ లో మంటలు చెలరేగాయి. స్పా రూమ్స్ లో స్టీమ్ బాత్ చేసే ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్పా రూమ్స్ ఉడ్ తో తయారు చేసి ఉండటంతో… మంటలు అంటుకుని దట్టమైన పొగ వ్యాపించినట్లు ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అగ్ని ప్రమాదం వల్ల మంటలతో పాటు పొగ దట్టంగా కమ్ముకోవడంతో ప్రమాదం జరిగిన చోటుకు పార్క్ హయత్(Park Hyatt) సిబ్బంది వెళ్లలేకపోయారు. దీనితో జూబ్లీహిల్స్ ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు.
Park Hyatt Fire Incident
పార్క్ హయత్ సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ ఫైర్ స్టేషన్ సిబ్బంది మంటలతో పాటు పొగను అదుపులోనికి తీసుకువచ్చారు. అయితే పార్క్ హయత్ హోటల్ లోనే హైదరాబాద్ సన్ రైజర్స్ టీం బస చేస్తోంది. దీనితో ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఫ్యాన్స్ ఒకింత ఆందోళన చెందారు. అయితే సన్ రైజర్స్ టీం సురక్షితంగా ఉన్నట్లు హోటల్ సిబ్బంది చెప్పారు. అలాగే ప్రమాదం జరిగిన వెంటనే సన్ రైజర్స్ బృందాన్ని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న మాట్లాడుతూ… పార్క్ హయత్ సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుతోనికి తీసుకున్నాం. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎవరికి ఎలాంటి అపాయం జరగలేదన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఆరో ఫ్లోర్లో హైదరాబాద్ సన్ రైజర్స్ టీం ఉందన్నారు. పవర్ హెచ్చుతగ్గుదల వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు. పవర్ సప్లై విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కేబుల్స్ సరిచూసుకోవాలని పార్క్ సిబ్బందికి సూచించామని డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న పేర్కొన్నారు.
Also Read : Tamil Nadu: నేడు తమిళ ఉగాది ! తమిళంలోనే శుభాకాంక్షలు చెప్పుకుంటున్న జనం !