Fire: కోల్ కతా రితురాజ్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం ! 14 మంది సజీవ దహనం !
కోల్ కతా రితురాజ్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం ! 14 మంది సజీవ దహనం !
Fire : పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్ కతాలో(Kolkata) ఘోర విషాదం చోటు చేసుకుంది. బుర్రాబజార్ ఏరియా ఫల్పట్టి మచ్చువా అనే పండ్ల మార్కెట్ సమీపంలో ఉన్న హోటల్ రితురాజ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 14 మంది సజీవ దహనం కాగా… పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్, పోలీసు, రెవిన్యూ, మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది రెస్కూ ఆపరేషన్ ప్రారంభించారు. మంటల్లో చిక్కుకున్న పలువురు క్షతగాత్రులను రక్షించి… సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మంటలను పూర్తి స్థాయిలో అదుపులోనికి తీసుకువచ్చిన తరువాత… మృతదేహాలను వెలికి తీసారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
Fire Accident in Kolkata
ఈ అగ్నిప్రమాద ఘటనపై కోల్ కతా నగర పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ వర్మ మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఘటన మంగళవారం రాత్రి 8:15 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన పద్నాలుగు మృతదేహాలను వెలికితీశాం. గాయపడిన బాధితులను మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాం. మంటలు అదుపులోకి వచ్చాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి’ అని అన్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాల్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రాణాలతో బయటపడిన పలువురు ప్రమాదంపై మాట్లాడారు. ముందుగా హోటల్ కారిడార్లలో దట్టమైన పొగకమ్ముకుంది. ఆ తర్వాత కరెంట్ పోయిందని చెప్పారు. హోటల్ లో ఉన్న పలువురు ప్రాణాల్ని రక్షించుకునేందుకు హోటల్ కిటికీలను పగలగొట్టి బయటపడేందుకు ప్రయత్నించారు. మరి కొంతమంది ప్రమాదం నుంచి బయటపడే దారిలేక అలాగే గదుల్లోనే ఉండిపోయారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకు సిబ్బంది వారిని రక్షించేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు.
ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత్ ముజుందారు తన అఫీషియల్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ప్రమాదంలో బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ యంత్రాంగానికి సూచించారు. ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు శుభంకర్ సర్కార్ స్పందించారు. కోల్‌కతా నగర కార్పొరేషన్ యంత్రాంగంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది విషాదకర సంఘటన అని ఆయన పేర్కొన్నారు. చాలా మంది ప్రజలు ఈ హోటల్ లో చిక్కుకొన్నారన్నారు. వారికి రక్షణ లేదు. భద్రతా లేదంటూ మండిపడ్డారు. అసలు మున్సిపల్ కార్పొరేషన్ ఏం చేస్తుందో తనకు అర్థం కావడం లేదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Also Read : Simhachalam: సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశ్రుతి ! గోడకూలి 8 మంది భక్తులు మృతి !