#Mangamma : తొలి మహిళా న్యూస్ రీడర్‌ – ఆంధ్రా నైటింగేల్ మంగమ్మ

First Woman News Reader‌ Andhra Nightingale Mangamma

జోలెపాళ్యం మంగమ్మ. అలనాటి రేడియో శ్రోతలకు సుపరిచితమైన పేరు. నేడు ఆకాశవాణి ప్రపంచము లోని అతిపెద్ద రేడియో ప్రసార వ్యవస్థలలో ఒకటి. భారత ప్రభుత్వ సమాచార , ప్రసార మంత్రిత్వశాఖ అధ్వర్యములో పని చేస్తుంది. రేడియో వార్తలు నిబద్ధతకు, విశ్వసనీయతకు తొలినాళ్ళ నుండి పేరు పొందాయి. సమాచార వ్యవస్థ పటిష్ఠంగా లేని రోజుల్లో రేడియో వార్తల కోసం జనం ఆసక్తిగా ఎదిరి చూసే వారు.

ఒకప్పుడు రేడియో మాత్రమే ఒక సమాచార సాధనంగా ఉన్న పాతకాలపు మరచి పోలేని రోజులలో, ప్రజలకు వార్తలు ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ప్రజలలో ఒకరిగా, అందరికీ ఆత్మీయులుగా వార్తా చదువరులు తమ తమ శైలులలో సుస్థిర స్థానం సంపాయించు కొన్నారు. ఆకాశవాణిలో వార్తా చదువరులుగా (NEWS READERS), ఎంతగానో ప్రాచుర్యం పొందిన వారిలో న్యూస్ రీడర్సుది ప్రధమ స్థానం.

ఆ విధంగా తెలుగులో ఇటు ప్రాంతీయ కేంద్రాలైన విజయవాడ, హైద్రాబాదు నుండి వచ్చే ప్రాంతీయ వార్తలు, అటు హస్తిన నుండి వచ్చే జాతీయ వార్తలు ప్రజలకు కావలిసిన విశేషాలను నిర్ణీత సమయ సారిణి ప్రకారం తెలియ చెప్పేవి.ఆ రోజుల్లో ఢిల్లీ నుంచి తెలుగు వార్తలు చదివే ఒక్కొక్కరిదీ ఒక్కొక్క బాణీ. ఎవరి స్టైల్ వారిదే.

ప్రముఖ సినీ నటుడు కొంగర జగ్గయ్య,కపిల, కాశీపతి, శ్రీ వాత్సవ, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, పన్యాల రంగనాధరావు, వనమాలి ప్రసాద్, జోళిపాళ మంగమ్మ, కందుకూరి సూర్యనారాయణ, తిరుమలశెట్టి ​శ్రీరాములు, అద్దంకి మన్నార్, వావిలాల రాజ్యలక్ష్మి, దుగ్గిరాల పూర్ణయ్య, ఏడిద గోపాలరావు వార్తలు చదవడంతో తెలుగువారి హృదయాలకు సన్నిహితులయ్యారు. ఇలా ఎందరో మహానుభావులు. ఎవరికి ఎవరు తీసిపోరు. వార్తలు మధ్య నుంచి విన్నా చదువు తున్నది పలానా అని చెప్ప గలిగేలా తమదయిన తరహాలో వార్తలు చదివే వాళ్ళు. జోలెపాళ్యం మంగమ్మ తెలుగు రచయిత్రి, రేడియో వార్తా చదువరి. మంగమ్మ ఆల్ ఇండియా రేడియోలో మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్‌గా ప్రసిద్ధురాలుగా పేరెన్నిక గన్నారు

ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలో తెలుగు న్యూస్‌ రీడర్‌గా, ఢిల్లీ తెలుగు న్యూస్‌ విభాగంలో దశాబ్ధ కాలానికి పైగా సేవలందించిన మంగమ్మ తెలుగు రేడియో శ్రోతలకు చిర పరిచయస్థురాలు. “ఆకాశవాణి.. వార్తలు చదువుతున్నది జోలిపాళ్యం మంగమ్మ” అంటూ తెలుగు శ్రోతలకు వార్తలు వినిపించిన చిరపరిచిత స్వరం ఆమెది. జోలిపాళ్యం మంగమ్మతో పాటు , విభాగ అధిపతి దుగ్గిరాల పూర్ణయ్య, మామిళ్లపల్లి రాజ్యలక్ష్మీ, కందుకూరి సూర్యనారాయణ, ఏడిద గోపాలరావు, అద్దంకి మన్నార్‌ తదితరులు ఆమె సహచరులు.

ఆమె చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1925, సెప్టెంబరు 12న జన్మించారు. ఎం.ఎ., బి.ఎడ్ చదివారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టాను పొందారు. ఈమెకు తెలుగు, ఇంగ్లీషు, ఫ్రెంచ్, ఎస్పరాంటో, తమిళ, హిందీ భాషలలో ప్రావీణ్యం ఉంది. ఈమె ఆలిండియా రేడియో న్యూఢిల్లీలో 10 సంవత్సరాలు ఎడిటర్‌గా, న్యూస్ రీడర్‌గా విధులు నిర్వర్తించారు. 1962 నుండి నేషనల్ ఆర్కీవ్స్, ఢిల్లీలో పరిశోధనలు చేశారు. బోధనా రంగంలో సుమారు పాతిక సంవత్సరాల అనుభవం సంపాదించారు. ఈమె కేంద్ర సమాచార శాఖ, విదేశాంగ శాఖలలో కీలకమైన పదవులను నిర్వహించారు. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మొదలైన సంస్థలలో జీవిత సభ్యురాలు.

ఇంకా ఈమె అనిబీసెంట్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్టు ఉపాధ్యక్షురాలిగా, గాంధీ ఆర్గనైజేషన్‌ ఫర్‌ రూరల్‌ డెవల్‌ప మెంట్‌ అధ్యక్షురాలిగా, లోక్ అదాలత్‌లో సభ్యురాలిగా వివిధ హోదాల్లో సేవలను అందించారు. ఆమె ఇంగ్లీషు, తెలుగు భాషలలో పలు పుస్తకాలను రచించారు.

న్యూఢిల్లీ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారం, కుప్పం రెడ్డమ్మ సాహితీ పురస్కారం, సిద్ధార్థ కళాపీఠం (విజయవాడ) విశిష్ట అవార్డు మొదలైన సత్కారాలను పొందింది. సరోజినీ నాయుడు అనుయాయిగా ఈమె పేరు గడించారు. “ఆంధ్రానైటింగేల్” అనే బిరుదును పొందారు.

తెలుగులో అచ్చయిన తొలి పుస్తకాలు (1746-1856), ఆంధ్రదేశంలో క్రైస్తవ మిషనరీల సేవ, ఇండియన్‌ పార్లమెంట్‌,
శ్రీ అరబిందో, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు, అనిబీసెంట్‌ పుస్తకాలను ఆమె తెలుగులో వెలువరించారు. అలాగే ప్రింటింగ్ ఇండియా, అల్లూరి సీతా రామరాజు, లాస్ట్ పాలెగార్ ఎన్‌కౌంటర్ విత్ ది బ్రిటిష్ ఇన్ ది సీడెడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 1846-1847, ది రేట్ స్కూల్స్ ఆఫ్ గోదావరి పుస్తకాలను ఆంగ్లంలో రచించారు.

మదన పల్లెలోని తన స్వగృహంలో 2017, ఫిబ్రవరి 1వ తేదీన తన 92వ యేట వృద్ధాప్య సమస్యలతో మరణించారు.

No comment allowed please