Floods in AP: ఏపీను వణికిస్తున్న వరదలు ! తొమ్మిది మంది మృతి !

ఏపీను వణికిస్తున్న వరదలు ! తొమ్మిది మంది మృతి !

Floods in AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీ(AP) వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు (Floods in AP)కురుస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ(Vijayawada), గుంటూరు ప్రాంతాల్లో ఆకాశం బద్దలైయిందా అన్నట్లు కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల ప్రభావంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. విజయవాడ నగరం అంతా జలదిగ్భందంలో చిక్కుకుంది. ఇంద్రకీలాద్రి నుండి కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కుండపోతగా కురిసిన వర్షాలు రాష్ట్రంలో తొమ్మిది మంది ప్రాణాలను బలిగొన్నాయి. కొండచరియలు విరిగిపడి ఆరుగురు మరణించగా, వాగులో కారు కొట్టుకుపోయి ముగ్గురు చనిపోయారు. కొండచరియల కింద నలిగి మరో నలుగురు గాయాలపాలయ్యారు.

విజయవాడ, మంగళగిరి, గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో శనివారం ఈ విషాద ఘటనలు జరిగాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి భారీగా కురిసిన వర్షాల కారణంగా విజయవాడ(Vijayawada) మొగల్రాజపురం సున్నపుబట్టీల సెంటర్‌లో శనివారం తెల్లవారుజామున కొండపై నుంచి భారీ రాళ్లు జారి రేకుల ఇళ్లపై పడ్డాయి. దీంతో రెండు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో ఆ రెండు ఇళ్లలో మొత్తం పదిమంది ఉన్నారు. వారిలో నవుడు మేఘన(25), బోలెం లక్ష్మి(49), పుర్‌ కాటిలాలో(38), జంపాన అన్నపూర్ణ(55), సంతోషాచారి(23) శిథిలాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయారు. పప్పరవారి శాంతి, పప్పరవారి స్వామి తీవ్రగాయాలపాలవగా, నవుడు సత్యనారాయణ , ఆయన భార్య నవుడు నాగమణిలకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించారు. అలాగే, గుంటూరు జిల్లా మంగళగిరి కొత్తపేటలో కొండ చరియలు విరిగిపడి నాగరత్మమ్మ(65) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కొండపై నుంచి బండరాళ్లు ముందుగా నవుడు సత్యనారాయణ ఇంటిపై పడ్డాయి. ఆ సమయంలో ఆ ఇంట్లో ముగ్గురు ఉండగా, సత్యనారాయణ కుమార్తె మేఘన శిథిలాల కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతిచెందారు.

కడప జిల్లా మైదుకూరుకు చెందిన సంతోషాచారి హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేయటానికి విజయవాడ వచ్చి మొగల్రాజపురం కొండప్రాంతంలో రేకుల ఇం టిలో అద్దెకు ఉంటున్నారు. అలాగే కౌతవరం గ్రామానికి చెందిన యశ్వంత్‌ కూడా ఆ గదిలో ఉంటున్నారు. శిథిలాల క్రింద నుండి సంతోషాచారి మృతదేహాన్ని వెలికితీశారు. యశ్వంత్‌ కూడా శిథిలా ల కింద ఉన్నాడని రాళ్ల తొలగింపు కొనసాగిస్తున్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు పెద్దపెద్ద జేసీబీలతో శిథిలాలను తొలగించారు. మధ్యాహ్నానికి మృతదేహాలన్నింటినీ బయటికి తీశారు. కాగా, విజయవాడలో ప్రైజర్‌పేట, గాంధీకొండ, గొల్లపాలెంగట్టు ప్రాంతాల్లోనూ భారీ కొండరాళ్లు జారిపడ్డాయి. గొల్లపాలెంగట్టు వద్ద కొండచరియలు, రిటైనింగ్‌ వాల్‌ కూలి ఓ ఇల్లు ధ్వంసమైంది. అలాగే, ఇంద్రకీలాద్రిపైనా కొండ చరియలు విరిగిపడి పడ్డాయి.

Floods in AP – వాగులో కొట్టుకుపోయిన కారు !

గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలవాడు వాగులో కారు కొట్టుకుపోయి ప్రైవేటు స్కూల్‌ ఉపాధ్యాయుడు నడింపల్లి రాఘవేంద్రరావు(40), విద్యార్థులు కోడూరి మాణిక్‌(9), పసుపులేటి శౌరీ(9) మరణించారు. నంబూరులోని ప్రైవేటు పాఠశాలకు ఉదయం స్కూల్‌ బస్సులోనే విద్యార్థులు మాణిక్‌, శౌరీ వచ్చారు. అయితే పాఠశాలకు సెలవు ప్రకటించడంతో ఉప్పలపాడులోని వారి ఇళ్ల వద్ద దింపుతానంటూ అదే గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు రాఘవేంద్రరావు తన కారులో వారిద్దరినీ ఎక్కించుకున్నారు. మధ్యలో వాగు ఉధృతికి కారు కొట్టుకుపోయి ముగ్గురూ మరణించారు.

Also Read : Hyderabad Rains: హైదరాబాద్ కు భారీ వర్ష సూచన ! సోమవారం పాఠశాలలకు సెలవు !

Leave A Reply

Your Email Id will not be published!