Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’ గురించి 70 దేశాల దౌత్యాధికారులకు బ్రీఫింగ్
‘ఆపరేషన్ సిందూర్’ గురించి 70 దేశాల దౌత్యాధికారులకు బ్రీఫింగ్
Operation Sindoor : పహాల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత భద్రతా బలగాలు ‘ఆపరేషన్ సిందూర్’ నిర్వహించిన సంగతి తెలిసిందే. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేసేందుకు ‘ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)’ పేరుతో పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడుల్లో తొమ్మిది ఉగ్రస్థావరాలు నేల మట్టం కాగా… వందల సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు. దీనితో ‘ఆపరేషన్ సిందూర్’ పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించింది. ఈ నేపథ్యంలో ‘ఆపరేషన్ సిందూర్’ గురించి రక్షణ నిఘా సంస్థ డీజీ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ రాణా 70 దేశాల దౌత్యాధికారులకు వివరించారు. లక్ష్యాల ఎంపిక ప్రక్రియ, భారత శక్తిసామర్థ్యాల ప్రదర్శన తదితర అంశాలను ఆయన తెలియజేశారు. భారత్ కు వ్యతిరేకంగా ప్రత్యర్థులు చేసిన తప్పుడు ప్రచారాన్ని, దానివల్ల ప్రాంతీయ స్థిరత్వంపై గల ప్రభావాన్ని విశదీకరించారు. అలాగే ఆ తప్పుడు సమాచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న తీరును వెల్లడించారు.
Operation Sindoor Updates
ఉగ్ర ముఠాలకు అండగా ఉంటూ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. ‘ఆపరేషన్ సిందూర్’తో శత్రుదేశాన్ని అన్నివిధాలుగా దెబ్బతీసిన భారత్… ఇప్పుడు దాయాదిపై ద్వైపాక్షికంగా ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ రోజు పలు దేశాల అధికారులకు కేంద్రం ప్రత్యేక బ్రీఫింగ్ ఇచ్చింది. ఢిల్లీలోని రక్షణశాఖ కార్యాలయంలో మధ్యాహ్నం ఈ కీలక భేటీ జరిగింది. ఇక, బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. భద్రతాపరంగా అనుసరించాల్సిన వ్యూహాలు, సైనిక సన్నద్ధతపై చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విదేశాంగ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులతోనూ ‘ఆపరేషన్ సిందూర్’ వివరాలను కేంద్రం పంచుకోనుంది. మే 19వ తేదీన పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ శశిథరూర్ నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఇందులో విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. ‘సిందూర్’ వివరాలను సభ్యులకు వెల్లడించనున్నారు.
Also Read : Randhir Jaiswal: ‘ఆపరేషన్ సిందూర్’పై భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన